ఫిఫా బెస్ట్‌ ప్లేయర్‌గా లియోనల్‌ మెస్సీ.. ఫ్రాన్స్‌ స్టార్‌ ఎంబాపేకు తప్పని నిరాశ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ఎంబాపే, మెస్సీ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ రెండోసారి ఫిఫా పురుషుల ‘బెస్ట్‌ ప్లేయర్‌’ అవార్డు చేజిక్కించుకున్నాడు. ఫ్రాన్స్‌ స్టార్‌ స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబాపేతో పోటీపడి.. మెస్సీ ఈ అవార్డు కైవసం చేసుకున్నాడు. 2022 సంవత్సరానికి గానూ ఫిఫా అవార్డులు అందజేసింది. జాతీయ జట్ల కెప్టెన్‌లు, కోచ్‌లు, స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌లతో కూడిన 211 మందితో పాటు ఆన్‌లైన్‌ ద్వారా అభిమానుల ఓటింగ్‌తో ఈ అవార్డు విజేతను నిర్ణయించారు. ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్‌ ప్లేయర్లు ఎంబాపే, బెంజిమా పోటీ పడగా.. 52 పాయింట్లతో మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. ఎంబాపే 44 పాయింట్లు దక్కించుకోగా.. బెంజిమా 34 పాయింట్లతో వరుసగా ద్వితీయ, తృతీయ ప్లేస్‌ల్లో నిలిచారు. మహిళల విభాగంలో అలెక్సియా వరుసగా రెండో ఏడాది ఈ పురస్కారం దక్కించుకుంది. పారిస్‌ వేదికగా జరిగిన అవార్డులు ప్రదానోత్సవంలో మెస్సీ పురస్కారాన్ని అందుకున్నాడు. బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డు అందుకోవడం మెస్సీకి ఇది రెండోసారి కాగా.. గతంలో పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, పోలాండ్‌ ప్లేయర్‌ రాబర్ట్‌ లెవండోస్కీ కూడా రెండేసి సార్లు బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డు దక్కించుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాన్నాళ్ల పాటు శ్రమించిన అనంతరం నా కల (ప్రపంచ కప్‌ నెగ్గడం) నెరవేరింది. మొత్తానికి విశ్వవిజేతనయ్యా. నా కెరీర్‌లో అదే అత్యుత్తమ క్షణం. ఫుట్‌బాల్‌ ఆడటం ప్రారంభించిన ప్రతి ఆటగాడు కనే కల అది. కానీ అతి కొద్ది మంది మాత్రమే దాన్ని నిజం చేసుకోగలుగుతారు. నా ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని 35 ఏళ్ల మెస్సీ అన్నాడు.

2022 డిసెంబర్‌ 18న ఖతర్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌పై నెగ్గిన అర్జెంటీనా విశ్వ విజేతగా అవతరించింది. గతంలో రెండుసార్లు కప్పు నెగ్గిన అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మెగాటోర్నీలో అర్జెంటీనాకు నాయకత్వం వహించిన మెస్సీ.. అన్నీ తానై వ్యవహరిస్తూ.. టీమ్‌ను జగజ్జేతగా నిలిపాడు. వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి పాలైన అర్జెంటీనా.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుస విజయాలతో దూసుకెళ్తు ఫైనల్‌కు అర్హత సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఫైనల్‌ ఫైట్‌లో మెస్సీ రెండు గోల్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఒక దశలో అర్జెంటీనా విజయం నల్లేరుపై నడకే అనుకుంటున్న దశలో ఫ్రాన్స్‌ యువ స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబాపే హ్యాట్రిక్‌ గోల్స్‌తో తమ జట్టును పోటీలోకి తెచ్చాడు. నిర్ణీత సమయంతో పాటు అదనపు టైమ్‌లోనూ ఇరుజట్లు సమంగా (3-3) నిలువగా.. అనంతరం విజేతను తేల్చేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2తో ముందంజ వేసింది. ప్రపంచకప్‌తోనే కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన మెస్సీ.. విశ్వవిజేతగా నిలిచిన అనంతరం తన నిర్ణయం మార్చుకున్నాడు. వరల్డ్‌ చాంపియన్‌గా మరికొంత కాలం కొనసాగాలనుకుంటున్నట్లు ప్రకటించి.. తన రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్నాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్