(ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, స్పోర్ట్స్ : అర్జెంటీనా స్టార్ ఫుట్ బాలర్ మెస్సీ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకొన్నాడు. 2014లోనే కలను సాకారం చేసుకోవాలనుకొన్నా, ఫైనల్లో అవకాశాన్ని కోల్పోయిన మెస్సీ.. ఈ సారి తప్పు చేయలేదు. తన దేశం కోసం, తన జట్టు కోసం, తన కోసం వరల్డ్ కప్‌ను గెలుచుకున్నాడు. 2 గోల్స్ కొట్టి అర్జెంటీనాను విశ్వ విజేతగా నిలిపాడు. 90 నిమిషాల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ చెరో రెండు గోల్స్ చేసి సమానంగా నిలిచాయి. అనంతరం ఎక్స్‌ట్రా టైంలో చెరో గోల్ చేసి స్కోర్లను సమం చేశారు. అయితే, షూటౌట్‌లో అర్జెంటీనా 4 పాయింట్లు సాధించగా, ఫ్రాన్స్ రెండు పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో ఫిఫా2022 వరల్డ్ కప్ అర్జెంటీనా సొంతమైంది.
నరాలు తెగే ఉత్కంఠ
ఫైనల్ అంటే ఇదే.. ఈ మాత్రం లేకపోతే మజానే ఉండదు. 90 నిమిషాల సమయంలో ఫస్టాఫ్‌లో అర్జెంటీనా రెండు గోల్స్ కొట్టింది. సెకండాఫ్‌లో ఫ్రాన్స్ రెచ్చిపోయింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎంబాపె 90 సెకన్ల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆ తర్వాత ఎక్స్‌ట్రా టైంలోనూ రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 30 నిమిషాల సమయంలో తగ్గేదేలే అన్నట్టు.. చెరో గోల్ సాధించాయి. కానీ, షూటౌట్‌లో అర్జెంటీనా పైచేయి సాధించింది.
మెస్సీకే గోల్డెన్ బాల్
ఈ వరల్డ్ కప్‌లో ఏడు గోల్స్ చేసిన లియోనల్ మెస్సీకి గోల్డెన్ బాల్ అవార్డు దక్కింది. 2014లో గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్నాడు. అర్జెంటీనాకే చెందిన ఎమిలియానో మార్టినెజ్ గోల్డెన్ గ్లవ్ గెలుచుకున్నాడు. ఎంబాపె గోల్డెన్ బూట్‌ను ఎంబాపె దక్కించుకొన్నాడు. ఈ వరల్డ్ కప్‌లో ఎంబాపె మొత్తం 8 గోల్స్ చేశాడు. అందులో మూడు గోల్స్ ఫైనల్ మ్యాచ్‌లోనే చేశాడు. అదీ హ్యాట్రిక్. 80, 81, 118 నిమిషాల్లో గోల్స్ కొట్టాడు. 56 ఏళ్ల తర్వాత ఈ రికార్డు నమోదైంది.
వరల్డ్ కప్‌ను ఆవిష్కరించిన దీపిక పదుకొణె
ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వేదికపై ట్రోఫీని బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపిక్ పదుకొణె ఆవిష్కరించింది. మ్యాచ్‌కు ముందు కప్ ను స్పానిష్ ఫుట్‌బాలర్ ఇకర్ కాసిల్లాస్‌తో కలిసి దీపికా మైదానంలోకి తీసుకొచ్చింది. అటు.. నోరా ఫతేహి కూడా ప్రదర్శన ఇచ్చింది.
ఫిఫా వేదికపై మెరిపించిన నోరా ఫతేహి
ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రోగ్రాంలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ మెరుపులు మెరిపించింది. బ్లాక్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. డేవిడో, ఐషా, ఓజునా, గిమ్స్, బాల్కీస్, రియాద్, మనల్ తదితర అంతర్జాతీయ కళాకారులతో పర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టింది.
ఫ్రాన్స్ ఆటగాళ్లకు మాక్రాన్ ఓదార్పు
అర్జెంటీనాతో హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో ఓడిన ఫ్రాన్స్ జట్టను ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ ఓదార్చారు. జట్టు ఓడిన అనంతరం కైలియన్ ఎంబాపెను మాక్రాన్ ఓదార్చుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్‌లో సెకనుకు 24 వేల ట్వీట్లు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ల మోత మోగింది. ప్రతి సెకనుకు 24,400 ట్వీట్లు చేశారు. దీన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేస్తూ.. ఫ్రాన్స్ గోల్ కోసం ట్వీట్ల వర్షం కురిసిందని తెలిపారు. వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యధికం అని పేర్కొన్నారు.