నాలుగు పదుల వయసులో నంబర్‌వన్‌ ర్యాంక్‌.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అండర్సన్‌ అరుదైన ఘనత..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||జేమ్స్ అండర్సన్ Photo: Twitter||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ‘ఇంగ్లిష్‌ వైన్‌ పాతబడుతున్నా కొద్ది విలువ పెరిగినట్లు’.. ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ రోజు రోజుకు మరింత రాటుదేలుతున్నాడు. టెస్టు క్రికెట్‌లో మరే పేస్‌ బౌలర్‌కు సాధ్యం కాని రీతిలో రెండు దశాబ్దాలుగా తన ఘన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న అండర్సన్‌.. 40 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తన స్వింగ్‌తో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అండర్సన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 866 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌కు చేరాడు. మరోవైపు.. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో దుమ్మురేపుతున్న భారత స్పిన్నర్లు కూడా ర్యాంకింగ్స్‌లో జోరు కనబర్చారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 864 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకగా.. రవీంద్ర జడేజా 763 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌కు చేరాడు. గాయం కారణంగా ఆరు నెలలుగా ఆటకు దూరమైన జడేజా.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులు దక్కించుకున్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. 2019 తర్వాత జడేజా టాప్‌-10లోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (858 పాయింట్లు) రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. 

పంత్‌ ప్లేస్‌ పదిలం.. 

కాగా.. తాజా ర్యాంకింగ్స్‌లో బౌలర్లు భారత బౌలర్లు సత్తాచాటగా.. బ్యాటర్లు మాత్రం నిలకడగా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం కోలుకుంటున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ (781 పాయింట్లు).. టీమిండియా తరఫున అత్యుత్తమంగా ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (777 పాయింట్లు) ఏడో ప్లేస్‌లో ఉన్నాడు. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 16వ ర్యాంక్‌కే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ 912 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉండగా.. స్టీవ్‌ స్మిత్‌ (875 పాయింట్లు; ఆస్ట్రేలియా), బాబర్‌ ఆజమ్‌ (862 పాయింట్లు; పాకిస్థాన్‌), ట్రావిస్‌ హెడ్‌ (826 పాయింట్లు; ఆస్ట్రేలియా), జో రూట్‌ (814 పాయింట్లు; ఇంగ్లండ్‌) వరుసగా ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ మన స్పిన్నర్లు సత్తాచాటారు. టాప్‌-5లో భారత్‌ నుంచి ముగ్గురు చోటు దక్కించుకోవడం విశేషం. అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో విజృంభిస్తున్న రవీంద్ర జడేజా 460 పాయింట్లతో ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (376 పాయింట్లు)  రెండో ర్యాంక్‌లో ఉండగా.. ఢిల్లీ టెస్టులో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అక్షర్‌ పటేల్‌ (283 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్