సిరాజ్‌ దెబ్బకు రెండో టెస్టు నుంచి వార్నర్‌ ఔట్‌.. -కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రెన్‌ షా

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||వార్నర్ Photo: Twitter||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఐపీఎల్లో సుదీర్ఘకాలం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు.. సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ భారత్‌లో భారీగా అభిమానులను సంపాదించుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నుంచి వార్నర్‌ అర్ధాంతరంగా తప్పుకున్నాడు. హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో బంతి హెల్మెట్‌కు తాకడంతో వార్నర్‌ గాయపడ్డాడు. అంతకుముందే మోచితికి బంతి బలంగా తాకడంతో.. వార్నర్‌ క్రీజులో ఇబ్బందిపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో సిరాజ్‌ వేసిన బౌన్సర్‌ వార్నర్‌ను గాయపర్చింది. దీంతో ఫిజియో సాయం అనంతరం అతడు బ్యాటింగ్‌ కొనసాగించాడు. భారత పిచ్‌లపై అపార అనుభవమున్న 36 ఏండ్ల ఎడమచేతి వాటం ఓపెనర్‌ జట్టుకు అండగా ఉంటాడని ఆస్ట్రేలియా భావిస్తే.. భారంగా పరిణమించాడు. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన వార్నర్‌.. తాజా పోరులోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు మొండిగా ప్రయత్నించి 15 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. 44 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌.. ఏ దశలోనూ క్రీజులో సౌకర్యవంతంగా కనిపించలేదు. కోట్ల పిచ్‌ బౌన్స్‌కు సహకరిస్తుండటంతో షమీ, సిరాజ్‌ పదే పదే బౌన్సర్లతో వార్నర్‌ను పరీక్షించగా.. వాటిని తట్టుకోలేక అతడు గాయాలపాలయ్యాడు. ఈ క్రమంలో షమీ బౌలింగ్‌లో కీపర్‌ శ్రీకర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా తొలి రోజు ఆట అనంతరం సహచర ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా మాట్లాడుతూ.. గాయాల కారణంగా వార్నర్‌ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వెల్లడించాడు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్‌ ఫీల్డింగ్‌కు రాలేదు. 


శనివారం కూడా వార్నర్‌ పరిస్థితి మెరుగవకపోవడంతో అతడి స్థానంలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ రెన్‌ షాను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దించుతున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. తలకు పదే పదే బంతి తగలడంతో వార్నర్‌కు వాంతులు అవుతున్నాయని జట్టు సిబ్బంది పేర్కొన్నారు. మూడో టెస్టుకు ముందు వరకు వైద్య బృందం వార్నర్‌ను పరిశీలిస్తుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. గత మ్యాచ్‌లో తుది జట్టులో ఉన్న రెన్‌షా.. ట్రావిస్‌ హెడ్‌ రాకతో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వార్నర్‌ గాయపడటంతో అనూహ్యంగా రెన్‌షాకు అవకాశం దక్కింది. కాగా.. తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆస్ట్రేలియా.. రెండో మ్యాచ్‌లో పట్టుదల ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసిన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ మంచి స్కోరు దిశగా సాగుతున్నది. అయితే స్పిన్‌ను బాగా ఎదుర్కొంటారనే పేరున్న భారత ఆటగాళ్లు మాత్రం పూర్తిగా తడబడ్డారు. టాపార్డర్‌ చేతులెత్తేయడంతో ఒక దశలో 139/7తో నిలిచిన రోహిత్‌ సేన.. అక్షర్‌ పటేల్‌ (74), రవిచంద్రన్‌ అశ్విన్‌ (37) రాణించడంతో 262 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట వీరిద్దరూ తమ విలువ చాటుకున్నారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా వార్నర్‌ స్థానంలో ట్రావిస్‌ హెడ్‌ను ఓపెనర్‌గా పంపింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్