పంత్‌ గైర్హాజరీలో ఢిల్లీని నడిపించేది అతడే.. కొత్త సారథిని ఎంపిక చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||డిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ Photo: twitter||


ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) కొత్త సారథిని పరిచయం చేసింది. ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను డీసీ కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గత సీజన్‌లో జట్టుకు నాయకుడిగా వ్యవహరించిన భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న పంత్‌.. ఇప్పుడిప్పుడే నడక ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. స్విమ్మింగ్‌ పూల్‌ ఊత కర్ర సాయంతో పంత్‌ అడుగులు వేస్తున్న వీడియోను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న విషయం తెలిసిందే. పంత్‌ మరో ఆరు నెలల పాటు మైదానంలో దిగలేని పరిస్థితి నెలకొనడంతో ఢిల్లీ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు జట్టు యాజమాన్యం గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త కెప్టెన్‌ను పరిచయం చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు వార్నర్‌ కెప్టెన్‌గా భారత స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. ‘‘రిషబ్‌ పంత్‌ మంచి నాయకుడు. అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను చక్కగా నడిపించాడు. మేమంతా అతడి నాయకత్వాన్ని మిస్‌ అవుతున్నాం. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞుడిని. ఢిల్లీ ఫ్రాంచైజీ ఎప్పుడూ నాకు సొంతింటిలాగే కనిపిస్తుంది. జట్టు సభ్యులతో కలిసేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. నైపుణ్యం ఉన్న బృందాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని వార్నర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. 


డైరెక్టర్‌గా దాదా

కెప్టెన్‌తో పాటు ఫ్రాంచైజీ డైరెక్టర్‌ పేరును కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ వెల్లడించింది. భారత మాజీ కెప్టెన్‌, బెంగలా టైగర్‌ సౌరవ్‌ గంగూలీని ఢిల్లీ జట్టు డైరెక్టర్‌గా నియమించింది. ఐపీఎల్‌, డబ్లూ్యపీఎల్‌లో ఢిల్లీ జట్లకు గంగూలీ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌గా వ్యవహరించిన గంగూలీ ఇకపై కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇప్పటికే మహిళల జట్టుతో మాట్లాడినట్లు దాదా వెల్లడించాడు. వార్నర్‌ విషయానికి వస్తే.. అతడి ఐపీఎల్‌ కెరీర్‌ ఢిల్లీ ఫ్రాంచైజీతోనే ప్రారంభించాడు. 2009 నుంచి 2013 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్‌.. కొన్ని మ్యాచ్‌ల్లో నాయకత్వం కూడా వహించాడు. అనంతరం 2014 నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మారిన వార్నర్‌. 2016లో హైదరాబాద్‌ జట్టుకు ఐపీఎల్‌ ట్రోఫీ అందించిన విషయం తెలిసిందే.   వార్నర్‌ను హైదరాబాద్‌ జట్టు వదిలేసుకోవడంతో 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని కొనుగోలు చేసుకుంది. గత సీజన్‌లో వార్నర్‌ ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా తాజా బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో వార్నర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో టెస్టులో గాయపడి కంకషన్‌ రూపంలో మ్యాచ్‌కు దూరమయ్యాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్