||క్రికెటర్ పృధ్వీ షా||
ఈ వార్తలు, స్పోర్ట్స్ న్యూస్: భారత యువ ఓపెనర్ పృథ్వీ షాపై అభిమానులు దాడికి పాల్పడ్డారు. సెల్ఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో కొందరు అభిమానులు అతడితో గోడవపడిన వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనలో 8 మందిపై కేసు నమోదైనట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. క్రికెటర్ కారు పై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసేందుకు కొందరు యువకులు ప్రయత్నించగా.. పృథ్వీ వారిని అడ్డుకుంటున్నట్లు వీడియోల్లో రికాౖర్డెంది. అందులో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం. ముంబైలోని శాంతాక్రూజ్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న పృథ్వీ షా.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైనా.. అతడికి తుది జట్టులో అవకాశం దక్కని విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ ఆడుతుండగా.. పృథ్వీ షా టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
విసిగించడంతోనే గొడవ..
జూనియర్ స్థాయిలో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లతో భవిష్యత్తు సచిన్ అనిపించుకున్న పృథ్వీ కెరీర్ ఆశించిన స్థాయిలో వెలగలేదనే చెప్పాలి. గాయాలు, ఫిట్‌నెస్ లేమి, ఫామ్ కోల్పోవడం, డోప్ టెస్టులో విఫలమవడం.. ఇలా తరచూ ఏదో ఒక ఇబ్బందితో జట్టు ఎంపికకు దూరమైన పృథ్వీ షా.. దేశవాళీలతో పాటు ఐపీఎల్లో మంచి ఇన్నింగ్స్‌లతో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే బుధవారం రాత్రి పృథ్వీ తన స్నేహితుడితో కలిసి ఓ స్టార్ హోటల్లో విందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న యువకులు పృథ్వీతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అభిమానుల ఉత్సాహాన్ని కాదనలేకపోయిన షా.. వారితో సెల్ఫీలు దిగాడు. అయితే వాళ్లు మరీ విసిగిస్తూ.. వేర్వేరు యాంగిల్స్‌లో సెల్ఫీలు కావాలంటూ పృథ్వీని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇదంతా గమనించిన హోటల్ మేనేజర్ కలుగజేసుకొని అభిమానులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించాడు. అయితే దీన్ని అవమానంగా భావించిన యువకులు.. అక్కడి నుంచి వెళ్లి పార్కింగ్ ప్లేసులో పృథ్వీ షా కోసం కాపుకాశారు. కాసేపటికి పార్టీ ముగించుకొని కారు వద్దకు చేరుకున్న పృథ్వీ అతడి స్నేహితుడిని దుర్భాశలాడారు. ఇంతటితో ఆగకుండా దాడికి యత్నించారు. బేస్‌బాల్ బ్యాట్‌తో కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో పృథ్వీ స్నేహితుడితో కలిసి కారులో ఉండగా.. వారిని ఆపేందుకు బయటకు వచ్చాడు. దీంతో ఆ సమూహంలోని ఓ అమ్మాయి పృథ్వీ పై కూడా దాడికి యత్నించింది. బేస్‌బాల్ బ్యాట్‌తో కారుతో పాటు పృథ్వీని కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. అతడు అడ్డుకున్నాడు. ఇంతటితో ఆగకుండా.. రూ. 50 వేలు ఇవ్వాలని లేకపోతే.. తప్పుడు కేసు పెడతామని పృథ్వీని ఇబ్బంది పెట్టింది. దీంతో అతడి స్నేహితుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 143తో పాటు 148, 384, 506 కింద కేసు నమోదు చేశారు.