రికార్డుల రారాజు ఖాతాలో మరో గౌరవం.. వాంఖడేలో సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||కుటుంబంతో సచిన్ Photo: Twitter||


ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: రికార్డుల రారాజు.. ప్రపంచ క్రికెట్‌లో మెరునగ ధీరుడు సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో సచిన్‌ టెండూల్కర్‌ నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరగుతున్నాయి. ముంబై గల్లీల్లో క్రికెట్‌ ఆడటం ప్రారంభించి.. అంచలంచెలుగా ఎదుగుతూ.. విశ్వమంతా వ్యాపించిన మాస్టర్‌కు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ సమున్నత స్థాయిలో గౌరవించాలనే ఉద్దేశంతో ఈ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ముంబై క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు అమోల్‌ కాలే మంగళవారం వివరాలు వెల్లడించాడు. వాంఖడే స్టేడియంలో ఓ క్రికెటర్‌కు విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. త్వరలోనే 50వ పడిలోకి అడుగుపెట్టనున్న సచిన్‌.. ఆమోదంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నాడు. మంగళవారం వాంఖడే కు విచ్చేసిన క్రికెట్‌ దిగ్గజం.. దీనిపై మరింత స్పష్టతనిచ్చాడు. ఈ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ.. వాంఖడేలో అడుగుపెడితే.. తన జీవిత చక్రం మొత్తం కళ్ల ముందు మెదలాడుతుందని అన్నాడు. 


‘వాంఖడేతో నా అనుబంధం ఇప్పటిది కాదు. అచ్రేకర్‌ సార్‌ తొలిసారి నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాతే నాకు ఆటపై మరింత ఇష్టం పెరిగింది. ఆ తరాత ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిపోయా. నా తొలి రంజీ మ్యాచ్‌ వాంఖడేలోనే జరిగింది. ఇక్కడి నుంచే క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభమైంది. నా జీవితంలోని ఎన్నో మధుర ఘట్టాలకు వాంఖడే వేదికైంది. 2011లో నా చిరకాల స్వప్నమైన వన్డే ప్రపంచకప్‌నూ ఇక్కడే దక్కించుకున్నా.. ఇక కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ (200వ టెస్టు) కూడా ఇక్కడే ఆడా. ఇలా నా కెరీర్‌కు వాంఖడే మైదానానికి విడదీయరాని అనుబంధం ఉంది. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్లేస్‌లో నా విగ్రహం ఏర్పాటు చేయనుండటం ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ముంబై క్రికెట్‌ సంఘం ప్రతినిధులు ఈ విషయం చెప్పినపుడు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యా. ముంబై సంఘంతో నా అనుబంధం సుదీర్ఘమైంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది’ అని పేర్కొన్నాడు. 


రిటైర్మెంట్‌ సమయంలో సచిన్‌.. సచిన్‌.. నినాదంతో మార్మోగిపోయిన వాంఖడే మైదానంలో తన విగ్రహం ఏర్పాటు చేయనుండటం తన జీవితంలో అతి పెద్ద సంఘటనగా నిలిచిపోతుందని టెండూల్కర్‌ అన్నాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్న మాస్టర్‌ టెస్టు క్రికెట్‌లో 200 మ్యాచ్‌లాడిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి వంద సెంచరీలు చేసిన మాస్టర్‌.. వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఇప్పటికే లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో సచిన్‌ మైనపు ప్రతిమ ఉండగా.. తాజాగా వాంఖడేలో మాస్టర్‌ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఏడాది చివర్లో భారత వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరుగనుండగా.. ఆ సమయంలో సచిన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న సచిన్‌ ఖాతాలో ఇది మరో కలికితురాయిగా నిలువనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్