ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సంబురం మొదలైంది. తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగ్గా.. న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు సమష్టిగా విఫలమైంది.
ప్రతీకాత్మక చిత్రం
ఇస్లామాబాద్, ఈవార్తలు : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సంబురం మొదలైంది. తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగ్గా.. న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు సమష్టిగా విఫలమైంది. ఏకంగా 60 పరుగులు భారీ తేడాతో ఓటమి పాలైంది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్.. అనూహ్య ఓటమితో తమ అభిమానులను నిరాశపర్చింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(113 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 107), టామ్ లాథమ్(104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. గ్లేన్ ఫిలిఫ్స్ (39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా(2/63), రౌఫ్(2/80) వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు.
లక్ష్య చేధనలో బరిలోకి దిగిన పాక్.. 47.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కుష్దిల్ షా (49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 69 ), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సల్మాన్ అఘా (28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ రూర్కీ(3/47), మిచెల్ సాంట్నర్(3/66) చెరో మూడు వికెట్లు తీశారు. మ్యాట్ హెన్రీ(2/25) రెండు వికెట్లు దక్కించుకున్నాడు. నాథన్ స్మిత్, మైకేల్ బ్రేస్‌వెల్ చెరో వికెట్ తీసారు. కాగా, ఈ ఘోర పరాజయం పాకిస్థాన్ సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో పరాజయం. అయితే, బాబర్ ఆజమ్ జిడ్డు బ్యాటింగ్‌తో పాక్ విజయవకాశాలను దెబ్బతీశాడు. క్రీజులో సెట్ అయిన తర్వాత కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం చేయలేదు. మరో ఎండ్‌లో దూకుడుగా ఆడబోయి రిజ్వాన్, ఫకార్ జమాన్, సల్మాన్ అఘా వికెట్లు పారేసుకున్నారు.