నీతూ, స్వీటీ పంచ్‌ పవర్‌కు పసిడి పతకాలు.. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నయా చరిత్ర

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||నీతూ, స్వీటీ పంచ్‌ పవర్‌కు పసిడి పతకాలు||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: భారత బాక్సింగ్‌ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. సొంతగడ్డపై మన బాక్సర్లు పంచ్‌ పవర్‌ చాటారు. ప్రతిష్ఠాత్మక బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీతూ గంగాస్‌, స్వీటీ బూర కొత్త చరిత్ర లిఖించారు. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపే లక్ష్యంగా పోటీకి సై అన్న నీతూ, స్వీటీ పసిడి పతకాలతో జిగేల్‌ అనిపించారు. ప్రత్యర్థులపై కనికరం లేకుండా పదునైన పంచ్‌లతో విరుచుకుపడుతూ ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు. బరిలోకి దిగిన తొలిసారే నీతూ స్వర్ణ పతకం ఒడిసి పట్టుకుంటే, తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్వీటీ తన పసిడి కలను సాకారం చేసుకుంది. స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా దిగ్గజ బాక్సర్‌, ఆరు సార్లు ప్రపంచ విజేత మేరీకోమ్‌, సరితాదేవి, జెన్నీ, లేఖ, నిఖత్‌ జరీన్‌ సరసన నీతూ, స్వీటీ నిలిచారు. 48 కేజీల ఫైనల్లో యువ బాక్సర్‌ నీతూ 5-0 తేడాతో లుట్స్‌సకైన్‌ అట్లాన్‌స్టెగ్‌ (మంగోలియా)ను చిత్తుచేసింది.

మెగాటోర్నీలో తిరుగులేని విజయాలతో తుదిపోరులోకి అడుగుపెట్టిన ఈ హర్యానా బాక్సర్‌ అదే జోరు కొనసాగించింది. తన ఎత్తును అనుకూలంగా మలుచుకుంటూ మంగోలియా బాక్సర్‌పై సూపర్‌ పంచ్‌లతో విరుచుకుపడింది. తొలి రౌండ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నీతూకు రెండో రౌండ్‌లో ప్రత్యర్థి నుంచి ఒకింత ప్రతిఘటన ఎదురైంది. అయితే మూడో రౌండ్‌లో ఎక్కడా పట్టు సడలించని నీతూ.. క్లీన్‌ పంచ్‌లు, జాబ్స్‌, హుక్స్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. రిఫరీ తనను విజేతగా ప్రకటించగానే ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన నీతూ కన్నీళ్లను ఆపుకుంటూ అభిమానులకు అభివాదం చేసింది.  

ఇక మరోవైపు స్వీటీ బూర ప్రయాణమే విచిత్రంగా సాగింది. 2014లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ లో రజతం గెలిచిన అనంతరం స్వీటీ.. ఈ మెగాటోర్నీలో మరెన్నడూ పోడియంపై నిలువలేకపోయింది. అలుపెరుగని దండయాత్ర కొనసాగించిన స్వీటీ.. ఎట్టకేలకు 9 సంవత్సరాల తర్వాత పోడియం ఫినిష్‌ చేసింది. అది కూడా కాంస్యం, రజతంతో సరిపెట్టుకోకుండా.. ఈ సారి స్వర్ణ పతకం సాధించి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. ఫలితం వచ్చిన వెంటనే రింగ్‌లోనే మోకరిల్లి కన్నీటి పర్యంతమైన స్వీటీ.. మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఆనందబాష్పాలు రాల్చింది.

శనివారం జరిగిన 81 కిలోల తుదిపోరులో స్వీటీ 4-3 తేడాతో వాంగ్‌ లీనా (చైనా)పై ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకుంది. పసిడి దక్కించుకోవాలన్న పట్టుదలతో పోటీకి దిగిన స్వీటీకి చైనా బాక్సర్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్‌లో స్వీటీ సంధించిన పంచ్‌లు పట్టుతప్పాయి. అయితే చైనా బాక్సర్‌ ఎత్తుగడను అంచనా వేసిన స్వీటీ కచ్చితమైన పంచ్‌తో పోటీలోకి వచ్చింది. దీంతో రెండో రౌండ్‌ ముగిసే సరికి ఈ హర్యానా బాక్సర్‌ 3-2 ఆధిక్యం కనబరిచింది. అయితే మూడో రౌండ్‌లో ప్రత్యర్థి పంచ్‌ల నుంచి తప్పించుకుంటూ వీలుచిక్కినప్పుడల్లా జాబ్స్‌, హుక్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి సఫలమైంది. ఇక ఆదివారం జరుగనున్న బౌట్లలో తెలంగాణ స్టార్‌ బాక్సర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌తో పాటు.. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై స్వర్ణ పతక పోరులో తలపడనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్