ఆదుకున్న అక్షర్‌, అశ్విన్‌.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 262 -ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 61/1

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ఆదుకున్న అక్షర్, అశ్విన్ photo: twitter||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: తొలి మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయం నుంచి ఆస్ట్రేలియా త్వరగానే కోలుకుంది. ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కంగారూలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బ్యాటర్లు సత్తాచాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసిన ఆసీస్‌.. మెరుగైన బౌలింగ్‌తో టీమిండియాను 262 పరుగులకు కట్టడి చేసింది. ఒక దశలో 139/7తో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (71 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 114 పరుగులు జోడించడంతో రోహిత్‌ సేన గట్టెక్కింది. విరాట్‌ కోహ్లీ (44), రోహిత్‌ శర్మ (32) ఫర్వాలేదనిపించారు. రాహుల్‌ (17) మరోసారి విఫలం కాగా.. వందో టెస్టు ఆడుతున్న చతేశ్వర్‌ పుజారా (0) ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ (4), శ్రీకర్‌ భరత్‌ (6) విఫలం కాగా.. రవీంద్ర జడేజా (26) కాస్త పోరాడాడు. ఆసీస్‌ బౌలర్లలో లియాన్‌ 5, మార్ఫే, కునెమన్‌ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారీ విజయం మూటగట్టుకున్న టీమిండియాకు ఢిల్లీలో శుభారంభం దక్కలేదు. టాపార్డర్‌ వైఫల్యంతో రెండొందల లోపే ఆలౌట్‌ అయ్యేలా కనిపించిన టీమిండియాను అశ్విన్‌, అక్షర్‌ జోడీ ఆదుకుంది. మొదట క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యతినిచ్చిన ఈ జంట.. కుదురుకున్నాక ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. రోహిత్‌, రాహుల్‌, పుజారా, శ్రేయస్‌ వంటి ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట.. అశ్విన్‌, అక్షర్‌ తమ విలువ చాటుకున్నారు. ముఖ్యంగా అక్షర్‌ టాపార్డర్‌ బ్యాటర్‌ను తలపిస్తూ చూడ చక్కటి షాట్లతో అలరించాడు. క్రమం తప్పకుండా స్ట్రయిక్‌ రొటేట్‌ చేసిన ఈ జోడీ.. ఎనిమిదో వికెట్‌కు 114 పరుగులు జోడించింది.  ఇక భారత్‌కు ఆధిక్యం దక్కడం ఖాయమే అనుకుంటున్న సమయంలో రెండో కొత్త బంతి అందుకున్న ఆస్ట్రేలియా.. పేసర్లను బరిలోకి దింపి టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరదించింది. 


కోహ్లీ వివాదాస్పద ఔట్‌!

సొంతగడ్డపై భారీ ఇన్నింగ్స్‌ ఆడేందుకు శతవిధాల ప్రయత్నించిన విరాట్‌ కోహ్లీ.. అంపైర్‌ ఇచ్చిన సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్‌ చేరడం చర్చనీయాంశమైంది. బంతి బ్యాట్‌, ప్యాడ్‌కు ఒకేసారి తగిలినా.. ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి కట్టుబడి థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడంతో కోహ్లీ అసహనంగా పెవిలియన్‌ చేరాడు. అనంతరం డగౌట్‌లోనూ ఈ అంశంపై భారీ చర్చ జరిగింది. టీవీల్లో రీప్లే చూసిన కోహ్లీ.. అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కెమరాల్లో రికాౖర్డెంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా దూకుడే మంత్రంగా బరిలోకి దిగింది. అక్షర్‌ ఇన్నింగ్స్‌ స్ఫూర్తితో ఢిల్లీ పిచ్‌పై ఎలా బ్యాటింగ్‌ చేయాలో గమనించిన ఆస్ట్రేలియా.. దాన్ని ఆచరణలో పెట్టింది. వన్డే తరహా ఆటతీరుతో ధాటిగా ఆడుతూ శనివారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 61/1తో నిలిచింది. వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న ట్రావిస్‌ హెడ్‌ (39 బ్యాటింగ్‌), మార్నస్‌ లబుషేన్‌ (16 బ్యాటింగ్‌) వేగంగా ఆడారు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5.08 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని ప్రస్తుతం ఆసీస్‌.. రోహిత్‌ సేన కంటే 62 పరుగుల ఆధిక్యంలో ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్