||నాథన్ లియాన్ Photo: Twitter||
ఈ వార్తలు, స్పోర్ట్స్ న్యూస్: 146 ఏళ్ళ చరిత్ర గల టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదైంది. అతిరథ మహారథులకు సాధ్యంకాని ఈ అరుదైన ఫీట్‌ను ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ తన పేరిట రాసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 116 మ్యాచ్‌లాడిన లియాన్.. 30,064 బంతులు వేశాడు. ఇందులో గొప్పేముంది.. ముత్తయ్య మురళీధరన్ (44,039), షేన్‌వార్న్ (40,705) అతడి కంటే పది వేల బంతులు ఎక్కువే వేశారనుకుంటున్నారా! అది కాదండీ బాబు.. ఇన్నాళ్లలో లియాన్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా గీత దాటలేదు. అంటే తన కేరీర్ మొత్తంలో లియాన్ ఒక్క నోబాల్ కూడా వేయలేదు. ఇప్పుడేమంటారు. 116 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా నోబాల్ వేయకుండా 30 వేల బంతులు వేయడం అంటే మాటలా! క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ ఆసీస్ బౌలర్ ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఈ అరుదైన ఫీట్ తన పేరిట లిఖించుకున్నాడు. 2011లో శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేసిన 35 ఏళ్ల లియాన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. సుదీర్ఘ కెరీర్‌లో ‘గీత దాటకుండా’ బౌలింగ్ చేసిన అతడి క్రమశిక్షణకు అభిమానులు సలాం కొడుతున్నారు. టీ20 క్రికెట్ ప్రాచూర్యంలోకి వచ్చాక నోబాల్స్ ప్రభావం మరింత పెరిగింది. ఒక్క నోబాల్‌తో మ్యాచ్ ఫలితాలు తారుమారైన సందర్భాలు కోకొల్లలు. అలాంటి సమయంలో లియాన్ సుదీర్ఘ కెరీర్‌లో ఒక్క నోబాల్ కూడా వేయకపోవడం గొప్ప విషయమే.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా.. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌లో జరిగిన ‘బోర్డర్-గవాస్కర్’ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో రోహిత్ సేన ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఈ ఫలితంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని చేరేందుకు టీమిండియా అడుగు ముందుకేసింది. ఇక 2013 నుంచి టీమిండియా సొంతగడ్డపై ఆడిన 43 టెస్టుల్లో 35 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం. ఈ పదేళ్ల కాలంలో స్వదేశంలో భారత్ కేవలం రెండు టెస్టులు మాత్రమే ఓడింది. ప్రస్తుతం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం దక్కించుకున్న రోహిత్ సేన.. శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా జరుగనున్న రెండో టెస్టు బరిలోకి దిగనుంది. ఈ సిరీస్‌ను 2-0 లేదా అంతకంటే మెరుగైన ఫలితంతో చేజిక్కించుకుంటే.. టీమిండియా నేరుగా డబ్లూ్యటీసీ ఫైనల్‌కు అర్హత సాధించనుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచకప్ వంటి ఈ మెగా మ్యాచ్ జూన్ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియంలో జరుగనుంది.