భారత్‌ వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా బలగమిదే.. మాక్స్‌వెల్‌, మిషెల్‌ మార్ష్‌ పునరాగమనం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ఆస్ట్రేలియా వన్డే జట్టు ప్రకటన Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: భారత పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ఆస్ట్రేలియా జట్టు.. వన్డే సిరీస్‌ కోసం జట్టును ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌ల ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయాలు మూటగట్టుకున్న కంగారూలు వచ్చే నెల 17 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనున్నారు. దీని కోసం గురువారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వన్డే సారథి ఆరోన్‌ ఫించ్‌ గత అక్టోబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించగా.. కమిన్స్‌ వన్డే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు అనంతరం వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన కమిన్స్‌ మార్చి 1న ప్రారంభం కానున్న మూడో టెస్టు వరకు తిరిగి భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇక గాయం కారణంగా చివరి రెండు టెస్టులకు దూరమైన డేంజరస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా.. వన్డే సిరీస్‌లో ఆడుతాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. మోచేతి గాయంతో ఇబ్బంది పడుతున్న వార్నర్‌ అప్పటి వరకు కోలుకుంటాడని ఆ జట్టు యాజమాన్యం భావిస్తున్నది. సీనియర్‌ పేసర్‌ మిషెల్‌ స్టార్క్‌తో పాటు ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిషెల్‌ మార్ష్‌ పునరాగమనం చేయనున్నారు. గాయాల కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న ఈ ముగ్గురు వన్డే సిరీస్‌ వరకు పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకుంటారని ఆస్ట్రేలియా సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ జార్జ్‌ బెయిలీ పేర్కొన్నాడు. 

టెస్టు సిరీస్‌లో భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా.. వన్డేల్లో కచ్చితంగా సత్తాచాటాలనే కృతనిశ్చయంతో కనిపిస్తున్నది. ఈ ఏడాది ఆఖర్లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో కంగారూలు ఈ సిరీస్‌ను సిరీయస్‌గా తీసుకున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ మార్చి 17న ముంబైలో జరుగనుండగా.. రెండో వన్డేకు (మార్చి 19) విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. మార్చి 22న చెన్నైలో చివరి పోరు జరుగుతుంది. సీనియర్‌ పేసర్‌ జోష్‌ హజిల్‌వుడ్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. త్వరలో ఇంగ్లండ్‌తో ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో హజిల్‌వుడ్‌కు విశ్రాంతినిచ్చినట్లు బెయిలీ తెలిపాడు. వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంబానికి ముందు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డే సిరీస్‌లు జరుగనున్నాయి. ‘మెగాటోర్నీకి ముందు టీమిండియాతో సిరీస్‌లు మా సన్నద్ధతకు సరిగ్గా సరిపోతాయి. భారత పిచ్‌లపై ఆడనుండటం మా ఆటగాళ్లకు మేలు చేస్తుంది. మ్యాక్స్‌వెల్‌, మార్ష్‌, రిచర్డ్‌సన్‌ చాలా ప్రతిభావంతులు. వారి రాకతో జట్టుకు అదనపు బలం చేకూరుతుంది’ అని బెయిలీ తెలిపాడు.  

భారత్‌, ఆస్ట్రేలియా వన్డే షెడ్యూల్‌

* తొలి వన్డే: మార్చి 17; వేదిక: ముంబై

* రెండో వన్డే: మార్చి 19; వేదిక: విశాఖపట్నం

* మూడో వన్డే: మార్చి 22; వేదిక: చెన్నై

ఆస్ట్రేలియా వన్డే జట్టు:

కమిన్స్‌ (కెప్టెన్‌), సీన్‌ అబాట్‌, ఆగర్‌, అలెక్స్‌ కారీ, కామెరూన్‌ గ్రీన్‌, ట్రావిస్‌ హేడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మార్నస్‌ లబుషేన్‌, మిషెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, జే రిచర్డ్‌సన్‌, స్టీవ్‌ స్మిత్‌, మిషెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టొయినిస్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జాంపా.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్