|| మహిళల టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా సొంతం Photo : Twitter||
ఈ వార్తలు, స్పోర్ట్స్ న్యూస్: పురుషుల క్రికెట్‌లో దశాబ్దాల పాటు ఆధిపత్యం కొనసాగించిన ఆస్ట్రేలియా.. ప్రస్తుతం మహిళల విభాగంలో అదే దూకుడు కొనసాగిస్తోంది. ప్రపంచంలో మరే జట్టుకూ సాధ్యంకాని రీతిలో ఆసీస్ ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. టోర్నీలో ఓటమి ఎరుగని ఆసీస్.. ఆదివారం జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. ఆస్ట్రేలియాకు ఇది ‘హ్యాట్రిక్’ టైటిల్ కావడం మరో విశేషం. మొదట ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బెత్ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్), అజేయ అర్ధశతకంతో అలరించగా.. గార్డ్‌నర్ (29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అలీసా హీలీ (18; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నమ్ ఇస్మాయిల్, మరీనే కాప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. లారా వాల్‌వార్ట్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టినా.. తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో దక్షిణాఫ్రికాకు పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో మేగన్ షుట్, గార్డ్‌నర్, బ్రౌన్, జెస్ తలా ఒక వికెట్ పడగొట్టారు. బెత్ మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, గార్డ్‌నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
అదే జోరు..
సెమీఫైనల్లో భారత్ జట్టుపై పోరాడి నెగ్గిన ఆస్ట్రేలియాకు.. ఫైనల్లో కనీస ప్రతిఘటన ఎదురు కాలేదు. సెమీస్‌లో ఒక దశలో టీమ్‌ఇండియా విజయం ఖాయం అనిపించినా.. ఏమాత్రం తగ్గని ఆసీస్ చివరి వరకు పోరాటం సాగించి సఫలమైంది. ఒత్తిడిని జయించడాన్ని బాగా వంటబట్టించుకున్న కంగారూలు.. హర్మన్‌ప్రీత్ సేనను మరోసారి రిక్తహస్తాలతో ఇంటికి పంపిన విషయం తెలిసిందే. తుదిపోరులో టాస్ గెలువడంతోనే సగం మ్యాచ్ గెలిచేసిన కంగారూలు.. బరిలోకి దిగాక మిగిలిన పని పూర్తి చేశారు. బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా ముద్రపడ్డ మూనీ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. గార్డ్‌నర్ ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించింది. మహిళల విభాగంలో తొలిసారి (2009) నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలువగా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు (2010, 2012, 2014లో) ఆస్ట్రేలియా కప్పు చేజిక్కించుకొని హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. 2016లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో వెస్టిండీస్ నయా చాంపియన్‌గా అవతరించగా.. అప్పటి నుంచి వరుసగా మూడోసారి (2018, 2020, 2023లో) ఆస్ట్రేలియా ట్రోఫీ చేజిక్కించుకొని డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. ఒత్తిడిని దరిచేరనివ్వకపోవడం.. క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాటం వీడకపోవడం.. ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వకపోవడం వంటి లక్షణాలతో ఆస్ట్రేలియా జట్టు.. ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో వెలుగులీనుతోంది.
6-మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది ఆరో ట్రోఫీ. 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఆ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.