భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో అనర్హత వేటుకు గురై ఒలంపిక్స్ లో పతకాన్ని తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇటువంటి ఇబ్బందే మరో భారత స్టార్ రెగ్యులర్ కు ఎదురు కావలసిన పరిస్థితిలో.. సదరు క్రీడాకారుడు, కోచ్ లు తీవ్ర స్థాయిలో శ్రమించి బరువు తగ్గడం ద్వారా భారత్ కు కాంస్య పతకాన్ని అందించి దేశం గర్వించేలా చేశారు. ఆ క్రీడాకారుడే స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్. ఒలంపిక్స్ లో భాగంగా 57 కిలోల విభాగంలో రి హిగుచి (జపాన్) తో సెమీఫైనల్ లో అమన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
అమన్ సెహ్రావత్
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో అనర్హత వేటుకు గురై ఒలంపిక్స్ లో పతకాన్ని తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇటువంటి ఇబ్బందే మరో భారత స్టార్ రెగ్యులర్ కు ఎదురు కావలసిన పరిస్థితిలో.. సదరు క్రీడాకారుడు, కోచ్ లు తీవ్ర స్థాయిలో శ్రమించి బరువు తగ్గడం ద్వారా భారత్ కు కాంస్య పతకాన్ని అందించి దేశం గర్వించేలా చేశారు. ఆ క్రీడాకారుడే స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్. ఒలంపిక్స్ లో భాగంగా 57 కిలోల విభాగంలో రి హిగుచి (జపాన్) తో సెమీఫైనల్ లో అమన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఈ బౌట్ అనంతరం సాయంత్రం 6:30 గంటల సమయానికి అమన్ సెహ్రావత్ 61.5 కిలో గ్రాముల బరువు ఉన్నాడు. దీంతో శుక్రవారం జరిగే కాంస్య పతక పోరు సమయానికి అమన్ 10 గంటల్లో 4.5 కిలో గ్రాముల తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై అప్రమత్తమైన కోచ్ లు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆపరేషన్ వెయిట్ లాస్ మిషన్ ను చేపట్టారు. అది ఫలించిన రెండో రోజు బరువు తూచే సమయానికి అమన్ సెహ్రావత్ ఏకంగా 4.6 కిలోల బరువు తగ్గి 56.9 కిలోలకు చేరడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. బరువు తగ్గేందుకు అమన్ సెహ్రావత్ కోచ్ లు సూచన మేరకు తీవ్రంగా శ్రమించాడు. తొలుత గంటన్నరపాటు మ్యాట్ పై కసరత్తులు చేశాడు. ప్రత్యర్థితో తలపడేటప్పుడు తీసుకునే పొజిషన్లను ఇందులో ప్రాక్టీస్ చేశాడు. తర్వాత గంటపాటు వేడి నీటితో స్నానం చేశాడు. అనంతరం జిమ్ లో 60 నిమిషాలు నిరంతరాయంగా ట్రైడ్మిల్ చేశాడు. ఆపై 30 నిమిషాలు అమన్ సెహ్రావత్ కు కోచ్ లు విశ్రాంతి ఇచ్చారు. తర్వాత సెషన్ కు ఐదు నిమిషాలు చొప్పున 5 సెషన్లపాటు ఆవిరి స్నానం చేయించారు. చివరి ఆవిరి
సెషన్ తర్వాత అమన్ బరువు చూస్తే 900 గ్రాములు ఎక్కువగా ఉన్నాడు. దీంతో అతడికి మసాజ్ చేయడంతోపాటు తేలికపాటి జాగింగ్ చేయించారు. అనంతరం సెషన్ కు 15 నిమిషాలు చొప్పున 5 సెషన్లు రన్నింగ్ చేయించారు. ఉదయం 4:30 సమయానికి అమన్ బరువు 56.9 కిలోలు దిగొచ్చింది. అంటే నిర్దేశిత 57 కిలోల కంటే 100 గ్రాములు తక్కువ. అప్పటికి కానీ భారత బృందం స్థిమిత పడలేదు. ఇన్ని కసరత్తులు నడుమ అమన్ కు గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి ఇచ్చారు. అలాగే కొద్దిగా కాఫీ తాగించారు. గురువారం రాత్రి అంతా అతడు నిద్రపోలేదు. 'అతడి బరువును ప్రతి గంటకు పరిశీలించాం. ఆ రాత్రి కాదు శుక్రవారం ఉదయం కూడా అమన్ నిద్రపోలేదు' అని కోచ్ దహియ వెల్లడించారు. బరువు తగ్గించడం సాధారణంగా జరిగే ప్రక్రియని, తమకు ఇది అలవాటే కానీ వినేష్ ఘటన నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనయినట్టు దహియ వెల్లడించారు. మొత్తంగా తామంతా పడిన కష్టాన్ని ప్రతి ఫలిస్తూ కాంస్య పతకంతో అమన్ అదరగొట్టడంతో యావత్ భారత్ తోపాటు కోచ్ లు ఆనందాన్ని వ్యక్తం చేశారు.