||మార్క్‌రమ్ Photo : Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: పరిమిత వనరులతోనే అద్భుతాలు సృష్టించే జట్టుగా పేరున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్).. గత కొన్ని ఐపీఎల్ సీజన్‌లుగా ఆకట్టుకోలేకపోతోంది. 2016లో చాంపియన్‌గా నిలిచిన రైజర్స్.. ఆ తర్వాత కప్పు దరిదాపుల్లోకి రాలేకపోతోంది. దీనికి తోడు విచిత్ర నిర్ణయాలు.. జట్టు ఎంపికలో లోపాలతో నానాటికి రైజర్స్ పరిస్థితి దీనంగా మారింది. గత సీజన్‌లో జట్టుకు సారథ్యం వహించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌ను వేలానికి వదిలేసిన ఆ జట్టు.. అతడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎయిడెన్ మార్క్‌రమ్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. వేలంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవడంతో అతడికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ఊహించినా.. పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి విఫలమైన మయాంక్‌ను కాదని మరోసారి విదేశీ కెప్టెన్ వైపు రైజర్స్ మొగ్గుచూపింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త కెప్టెన్‌ను పరిచయం చేసింది. ‘నిరీక్షణ ముగిసింది.. ఆరెంజ్ ఆర్మీ కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌కు స్వాగతం పలకండి’ అని ఎస్‌ఆర్‌హెచ్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించగా.. పది జట్లు పాల్గొన్న లీగ్‌లో మన టీమ్ ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గి.. ఎనిమిదింట ఓటమి పాలైంది. మార్చి 31 నుంచి ఐపీఎల్-2023 ప్రారంభం కానుండా.. లీగ్‌లో హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఆ అనుభవంతో..
ఇటీవల దక్షిణాఫ్రికాలో తొలిసారి ఫ్రాంచైజీ లీగ్ ప్రారంభం కాగా.. అందులోనూ సన్‌రైజర్స్ యాజమాన్యం జట్టును కొనుగోలు చేసింది. అక్కడ జట్టుకు సారథిగా వ్యవహరించిన మార్కర్‌మ్.. సన్‌రైజర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. 29 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్.. ‘దక్షిణాఫ్రికా 20’ లీగ్‌లో అదరగొట్టాడు. 366 పరుగులు చేయడంతో పాటు.. 11 వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించాడు. సారథిగా జట్టును ముందుండి నడిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. దీంతో అతడికే హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే డేవిడ్ వార్నర్ విషయంలో రైజర్స్ పెద్ద తప్పు చేసిందని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జట్టుకు ఫుల్ క్రేజ్ తీసుకొచ్చిన డేవిడ్ భాయ్‌ను వదిలేసుకొని.. అనామక క్రికెటర్ మార్క్‌రమ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా వేలంలోనూ రైజర్స్ వ్యవహార శైలి విచిత్రంగా కనిపించింది. టీమిండియా ఆటగాళ్ల కోసం కనీస ప్రయత్నం కూడా చేయని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం.. అనామక ప్లేయర్లపై కోట్లు కుమ్మరించింది. కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం మార్క్‌రమ్ మాట్లాడుతూ.. ‘సన్‌రైజర్స్‌కు సారథ్యం వహించనుండటం గర్వంగా ఉంది. ఫాఫ్ డుప్లెసిస్, కేన్ విలియమ్సన్‌ను దగ్గరి నుంచి గమనించా.. వారి బాటలోనే ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తా. హైదరాబాద్ జట్టుకు అభిమానుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. వారి అంచనాలను అందుకునేందుకు నా వంతు కృషి చేస్తా. దక్షిణాఫ్రికా లీగ్‌లో సారథిగా వ్యవహరించిన అనుభవంతో జట్టు సభ్యులందరినీ కలుపుకొని పోతా’ అని అన్నాడు.