||అఫ్ఘనిస్థాన్ సంచలన విజయం Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు సంచలన విజయం నమోదు చేసుకుంది. తమ క్రికెట్ చరిత్రలోనే చెప్పుకోదగ్గ విజయాన్ని అఫ్గాన్ ఖాతాలో వేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన పోరులో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన ఈ పోరులో అఫ్గాన్ సమిష్టిగా సత్తాచాటింది. అఫ్గానిస్థాన్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ నాయకత్వంలో బరిలోకి దిగగా.. పాకిస్థాన్ ఈ సిరీస్ నుంచి తమ ప్రధన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ లేకుండానే పాకిస్థాన్ బరిలోకి దిగింది.
స్టార్ల గైర్హాజరీలో షాదాబ్ ఖాన్ పాక్ జట్టుకు నాయకత్వం వహించగా.. ఆ జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ విజయంతో తమ జట్టులో ఆత్మవిశ్వాసం నింపిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. ‘‘పాకిస్థాన్‌పై తొలి విజయం సాధించినందకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మేం చాలాసార్లు పాకిస్థాన్‌పై గెలుపునకు చేరువగా వచ్చాం. కానీ అప్పుడు సరిగ్గా ముగించలేకపోయాం. ఈ సారి ఆ తప్పు చేయకుండా చివరి వరకు పోరాటం కొనసాగించడంతో మ్యాచ్ మా వశమైంది. అఫ్గానిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. మ్యాచ్‌లో విజయం సాధించినా.. మా టాపార్డర్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది’’ అని మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులకు పరిమితమైంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో మహమ్మద్ హారిస్ 6 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టగా.. అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం మ్యాచ్ ముగిసేవరకు కొనసాగింది. అబ్దుల్లా షఫీఖ్ (0), ఆజమ్ ఖాన్ (0) డకౌట్ కాగా.. అయూబ్ (17), తయ్యబ్ తాహిర్ (16), ఇమాద్ వసీమ్ (18), షాదాబ్ కాన్ (12) తలా కొన్ని పరుగులు చేయడంతో పాకిస్థాన్ చివరకు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ నబి, ముజీబ్ రహమాన్, ఫజల్ హక్ ఫరూఖీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 రన్స్ చేసింది. నబి (38 నాటౌట్) రాణించాడు. పాక్ బౌలర్లలో ఇన్సానుల్లా రెండు వికెట్లు తీశాడు. చేజింగ్‌లో అఫ్గాన్ ఒక దశలో 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా.. నబి క్రీజులో ఎదురు నిలిచి జట్టును గెలిపించాడు.
