రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపు.. సమిధ అయ్యేది కాంగ్రెస్ అని టాక్..?

తెలంగాణలో మహాయజ్ఞం జరుగుతున్నది. మోదీ-షా నేతృత్వంలో బీజేపీ మొదలుపెట్టిన ఈ యజ్ఞాన్ని.. టీడీపీ పునరుజ్జీవం కోసం అర్రులుచాస్తున్న చంద్రబాబు ముందుండి నడిపిస్తున్నారు. ‘ప్రభుత్వ కూల్చివేత’ యజ్ఞఫలంగా జరుగుతున్న ఈ యజ్ఞంలో చివరకు సమిధ అయ్యేది మాత్రం రేవంత్‌రెడ్డిని గుడ్డిగా నమ్ముతున్న కాంగ్రెస్సే.

telangana politics

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మహాయజ్ఞం జరుగుతున్నది. మోదీ-షా నేతృత్వంలో బీజేపీ మొదలుపెట్టిన ఈ యజ్ఞాన్ని.. టీడీపీ పునరుజ్జీవం కోసం అర్రులుచాస్తున్న చంద్రబాబు ముందుండి నడిపిస్తున్నారు. ‘ప్రభుత్వ కూల్చివేత’ యజ్ఞఫలంగా జరుగుతున్న ఈ యజ్ఞంలో చివరకు సమిధ అయ్యేది మాత్రం రేవంత్‌రెడ్డిని గుడ్డిగా నమ్ముతున్న కాంగ్రెస్సే. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికతో మొదలైన ఈ మహా యజ్ఞం.. బీజేపీలో మూకుమ్మడిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరికతో దిగ్విజయంగా ముగుస్తుంది. కనీసం 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తం తీర్థం పుచ్చుకున్న తర్వాత ఈ యజ్ఞంలో కీలకమైన, అసలైన ఘట్టం మొదలవుతుంది. ఈ ఘట్టంలో బీజేపీ రంగ ప్రవేశం చేస్తుంది. కీలకమైన ఈ ఘట్టంలో మూడు పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వాటిలో మొదటిది.. కాంగ్రెస్‌ మంత్రుల్లో ఎవరో ఒకరు కొంతమంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం చేయడం. రెండోది.. రేవంత్‌రెడ్డి బీజేపీతో అంటకాగుతున్నారని, ఆయన త్వరలో కమలం తీర్థం పుచ్చుకోవచ్చని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలోకి తేవడం. ఈ రెండు కుదరని పక్షంలో మూడోదాన్ని తెరపైకి తీసుకురావచ్చు. రేవంత్‌రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసును తిరగదోడి, బీజేపీలోకి లాక్కోవడం. ఈ మూడింటిలో ఏ పరిణామం జరిగినా దాన్ని రేవంత్‌ తనకు అనుకూలంగా మార్చుకుంటారు. ‘నేనేమీ కావాలని బీజేపీలోకి చేరలేదు. కాంగ్రెస్‌ నేతలే నాపై బురదజల్లారు. దుష్ప్రచారం చేశారు. అందుకే బీజేపీలోకి చేరాల్సి వచ్చింది’ అని తెలివిగా సమర్థించుకుంటారు.

ఈ మూడింటిలో ఏ పరిణామం జరుగుతుందనే విషయాన్ని పక్కనపెడితే ఏది జరిగినా మొదట పార్టీ ఫిరాయించే 25 మంది, కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 30 మంది మొత్తంగా కనీసం 55 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కమలం పార్టీ కండువా కప్పుకోవడం మాత్రం ఖాయం. వీరిలో ఒకరిద్దరు మంత్రులున్నా అశ్చర్యపోనక్కర్లేదు. రేవంత్‌ వెంట 30 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా? అనే సందేహం కలగవచ్చు. అయితే వారు తప్పక వెళ్తారు. ఎందుకంటే, కాంగ్రెస్‌ టిక్కెట్‌పై గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 30 మంది ‘మేం రేవంత్‌ ప్రచారం చేయడం వల్లే గెలిచాం’ అని నమ్ముతున్నారు. వారంతా మొదటిసారి గెలిచినవారు, మంత్రి పదవులు దక్కనివారే. పైగా ఇప్పుడున్న క్యాబినెట్‌లో అందరూ సీనియర్‌ నాయకులే ఉన్నారు. ఎవరికి వారు గ్రూప్‌లను మెయింటెన్‌ చేస్తున్నారు. ఇక మిగిలిన ఈ 30 మంది వరకు రేవంత్‌ గ్రూప్‌ అని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పైగా పార్టీ మారి, బీజేపీ సర్కార్‌ ఏర్పాటులో సహకరిస్తే మంత్రి పదవులు, ఇతర కీలకమైన పదవులు దక్కుతాయంటే ఎవరు మాత్రం కాదంటారు. అంతేకాదు, అలాంటి పరిస్థితే వస్తే పార్టీ ఫిరాయించే వారంతా తనవెంటే నడవాలనే ఉద్దేశంతో ఫిరాయింపులను రేవంతే దగ్గరుండి మరీ చక్కబెడుతున్నారు. వేరే వాళ్ల ద్వారా పార్టీలో చేర్చుకుంటే భవిష్యత్తులో తనకు హ్యాండ్‌ ఇవ్వవచ్చనే భయం కాబోలు.

ఈ ఎపిసోడ్‌ మొత్తంలో బీజేపీ పోషించే పాత్రే కీలకం. అధికార పీఠంపై కంటే పార్టీ బలాన్ని పెంచుకునేందుకే బీజేపీ ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. తద్వారా క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకుని, భవిష్యత్తులో సొంతంగా అధికారంలోకి రావాలని, దాంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. అందుకు అవసరమైతే సీఎం సీటును వేరే వారికి ఇచ్చి.. వెనకుండి నడిపించేందుకు కూడా ఆ పార్టీ వెనుకాడదు. మహారాష్ట్రలో జరుగుతున్నదదే. తెలంగాణలో తమ పార్టీ అనుకున్నంత బలంగా లేదని బీజేపీకి తెలుసు. పార్లమెంట్‌లో 8 ఎంపీ సీట్లు గెల్చుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ప్రాధమ్యాలు మారిపోతాయని ఆ పార్టీ నాయకత్వానికి తెలుసు. సార్వత్రిక ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి తమ పార్టీని వెనక్కి నెట్టేసి, రేసులో ముందుంటుందని ఆ పార్టీ అధిష్ఠానానికి ఎరుకే. ఇప్పటికీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి బలమైన క్యాడర్‌ లేదు. మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కొన్ని చోట్ల ఆ పార్టీకి ఏజెంట్లే లేరన్నది వాస్తవం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇదే విషయాన్ని తెలియజేశాయి. దక్షిణాదిలో ఆ పార్టీ నుంచి ఒకేఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు. అది కూడా మత ప్రచారం ఆధారంగా. ఈ విషయం ఆ పార్టీకి కూడా తెలుసు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో క్యాడర్‌ను బలోపేతం చేసుకోవాల్సిందే. అలా జరగాలంటే కేంద్రంలో అధికారంలో ఉంటేనే సరిపోదు. రాష్ట్రంలోనూ అధికార పీఠమెక్కాలి. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా లీడర్లతో పాటు క్యాడర్‌ను పెంచుకోవచ్చన్నది ఆ పార్టీ ఆలోచన.

అదీకాకుండా ఈటల రాజేందర్‌ లాంటి నేతలకు పెద్దపీట వేసే అవకాశమూ లేకపోలేదు. ఆయనతో ఎంపీగా రాజీనామా చేయించి, ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకు కారణమూ ఉంది. ఇప్పుడున్న బీజేపీ అగ్ర నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ లాంటివారికి పెద్దగా తెలంగాణ ఉద్యమ చరిత్ర లేదు. మరోసారి ‘ఉద్యమం’ అనే మాట తెలంగాణలో ప్రాధాన్యం సంతరించుకుంటే ఈటలను ముందుపెట్టవచ్చు. తద్వారా ఉద్యమ నేతలకే అగ్రతాంబూలం ఇచ్చామని చెప్పుకొనే అవకాశం కూడా ఉంటుంది.

అయితే ఈ యజ్ఞంలో కీలకపాత్ర పోషిస్తున్న మరొకరు చంద్రబాబు. ఈ యజ్ఞంలో కీలకపాత్ర పోషించే ఆయన స్వార్థం ఆయనకుంది. తెలంగాణలో టీడీపీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు ఇక్కడ తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉండటం ఎంతో అవసరం. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ తన శిష్యుడే కావచ్చు కానీ, అధికార పార్టీ మాత్రం కాదు కదా. అదే తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే, ఆ ప్రభుత్వాన్ని రేవంత్‌ నడిపితే తనకు తిరుగుండదని చంద్రబాబుకు తెలుసు. బీజేపీ ప్రభుత్వం ఉంటే, టీడీపీ ఎదుగుదలకు పెద్దగా అడ్డు చెప్పదు. అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగినంతకాలం.. రేవంత్‌ సీఎం అయినప్పటికీ ఏదో ఒక రోజు ఇబ్బంది తప్పదు. అందుకే చంద్రబాబు కూడా ఈ యజ్ఞం సఫలమయ్యేందుకు తనవంతు  సహకరిస్తారనడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.

‘కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం’, బీఆర్‌ఎస్‌ను బొందపెడతాం’ అంటూ ఫిరాయింపులకు వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్‌ నేతలు.. తమ పార్టీకి, తమ ప్రభుత్వానికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించలేకపోతున్నారు. పైన చెప్పినట్టు గనుక జరిగితే మాత్రం రేపటి రోజున ప్రశ్నించే హక్కు కాదు కదా, కనీసం మాట్లాడేందుకు మొహం కూడా చెల్లదు కాంగ్రెస్‌ నేతలకు. ఏదేమైనా ఈ యజ్ఞం గనుక దిగ్విజయంగా పూర్తయితే మొట్టమొదట యజ్ఞ ఫలాన్ని అందుకునేది రేవంత్‌ కాగా.. యజ్ఞంలో ఆహుతయ్యేది మాత్రం కాంగ్రెస్సే.

- నాయక్, రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్