సోనియమ్మా నీ రుణం తీరింది.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సమాజం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||సోనియాగాంధీ||

(ఈవార్తలు సంపాదకీయం)

తెలంగాణ అంటే సంస్కృతి. ఇక్కడి బతుకమ్మ అయినా, జానపదాలు అయినా, యాస అయినా ప్రత్యేకమే. ప్రపంచమంతా ఆధునికత వైపు వెళ్తున్నా, ఆ ఆధునికతను అందిపుచ్చుకుంటూనే సంస్కృతిని కాపాడుకుంటున్నది తెలంగాణ. ముఖ్యంగా ఆడబిడ్డకు తెలంగాణ సమాజం ఇచ్చే మర్యాద చాలా గొప్పది. ఆడబిడ్డ ఇంటికి వస్తే కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది. ఆడబిడ్డ ఏదైనా సాయం చేస్తే రుణం కచ్చితంగా తీర్చుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఇప్పుడు కూడా (తాజా అసెంబ్లీ ఎన్నికల్లో) ఆడబిడ్డ రుణం తీర్చుకున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రుణం తీర్చుకున్నారు. ఉద్యమం ఉధృత స్థాయిలో జరుగుతున్నప్పుడు తెలంగాణ ఇచ్చి తీరుతానని అనుకున్న ఆమె.. అందుకు తగ్గట్టుగా బిల్లును చకచకా రూపొందించారు. దగ్గరుండి అన్ని చర్యలు తీసుకున్నారు. ఆంధ్రాలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తెలిసినా, ముందడుగు వేశారు. మాట ప్రకారం తెలంగాణ ఇచ్చి, తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చారు. ఇది నిజంగా 4 కోట్ల ప్రజలకు సోనియాగాంధీ చేసిన సాయమే. అంతకుముందు అనేక రాజకీయ కారణాలతో ఆమె తెలంగాణ ఏర్పాటుకు చర్యలు చేపట్టి ఉండకపోవచ్చు. కానీ, 2009లో ఇక్కడి యువత ఆకాంక్షను అర్థం చేసుకుని, తాను ఫిక్స్ అయ్యి, దాన్ని నిజంగానే సాకారం చేశారు.

తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రుణం కూడా తీరింది

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయే అయినా, తెచ్చింది మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. ఆనాడు కేసీఆర్ అంటే తెలంగాణ గుండె. కేసీఆర్ అంటే తెలంగాణ సమాజం. అందుకే తెలంగాణ సమాజం తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చింది. ముందుగా ఆయన రుణం తీర్చుకున్న తెలంగాణ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం అందించి సోనియా రుణం కూడా తీర్చుకుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి కొదవలేదు. సంక్షేమానికి ఇబ్బంది లేదు. కానీ, తెలంగాణ ఎప్పుడూ కోరుకునేది ఆత్మగౌరవం. దానికోసమే తెలంగాణను సాధించింది. ఇప్పుడూ ఆ ఆత్మగౌరవం కోసమే కేసీఆర్‌ను ఓడించింది. అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఆ నాడు ఆంధ్రా పాలకుల అహంకారాన్ని సహించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలన అహంకారాన్నీ సహించలేదు. అందుకే, ఓటుతో ఆత్మగౌరవాన్ని సాధించింది.

ఆడబిడ్డ సాయం తెలంగాణ ఉంచుకోదు

అవును! సాయం ఎవరు చేసినా తెలంగాణ తిరిగి సాయం చేస్తుంది. ఆడబిడ్డ సాయం చేస్తే కచ్చితంగా రుణం తీర్చుకుంటుంది. అందుకు నిదర్శనమే కాంగ్రెస్ పార్టీకి అధికారం. కాంగ్రెస్ పార్టీ తమకేదో గొప్ప అభివృద్ధి చూపిస్తుందనో, 6 గ్యారెంటీలు నెరవేర్చుతుందనో ఆశపడి ఓటు వేయలేదు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు.. ఇప్పుడు ఆమె రుణం తీర్చుకునే సమయం వచ్చింది.. ఇదే సరైన సమయం.. అని ఆలోచించిన తెలంగాణ ప్రజలు సోనియమ్మకు ఓటేశారు. ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవంతో ఓటు వేశారన్నది సుస్పష్టం. తెలంగాణ రాష్ట్రాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన సోనియాగాంధీకి రిటర్న్ గిఫ్ట్‌గా అధికారం అప్పజెప్పారు. ఇదే కదా తెలంగాణ సంస్కృతి.. ఇదే కదా తెలంగాణ సమాజం ఇతరులకు ఇచ్చే మర్యాద.. ఇదే కదా ఆత్మాభిమానం.. ఇదే కదా ఆత్మగౌరవం.

వెబ్ స్టోరీస్