టీడీపీలోకి మాజీ మంత్రి.. ఆయనకే తెలంగాణ పార్టీ పగ్గాలు.. మరో మాజీ మంత్రి కూడా..?

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించడంతో.. పాత నేతలంతా సైకిల్ ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు అధినేత చంద్రబాబుతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం.

malla reddy

మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి

తెలంగాణలోకి వస్తున్నాం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించగానే ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం చంద్రబాబు తన ఫోకస్ అంతా ఏపీపైనే పెట్టారు. ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావటంపైనే దృష్టిసారించారు. ఐదేళ్లు ముగిసే సరికి మళ్లీ సీఎం పీఠంపై ఎక్కి కూర్చున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ శ్రేణులు కూడా ఉత్తేజాన్ని పొందాయి. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించడంతో.. పాత నేతలంతా సైకిల్ ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు అధినేత చంద్రబాబుతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం.

వాస్తవానికి, తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ కేడర్ బలంగా ఉంది. తెలంగాణ ఏర్పాటుతో టీడీపీకి భవిష్యత్తు లేదని చాలా మంది గులాబీ పార్టీలో చేరారు. పైగా, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండటంతో చేసేదేం లేక కారులోనే ప్రయాణం సాగించారు. అయితే, తాజా పరిస్థితులు మారాయి. గులాబీ పార్టీ అధికారం కోల్పోవటంతో ఆ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ అంటే గిట్టనివాళ్లు.. హస్తం తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందో లేదోనన్న అనుమానం.. లాంటి అంశాలు వారిలో టీడీపీపై ఆశలు రేకెత్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏపీలో అధికారంలో ఉండటంతో టీడీపీలో చేరితే వచ్చే ఐదేళ్లు డోకా ఉండబోదని ఆలోచించే సైకిల్ వైపు పలువురు మాజీమంత్రులు చూస్తున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఒకరిద్దరు.. పచ్చ కండువా కప్పుకొనేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. వాస్తవానికి ఈయన టీడీపీ వ్యక్తే. తెలంగాణలో మారిన పరిస్థితులతో బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ అధికారం కోల్పోవటంతోనే కాంగ్రెస్‌లో చేరాలని ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. పైగా, కర్ణాటకకు వెళ్లి డీకే శివకుమార్‌ను కలవటం, ఆ ఫొటోలు వైరల్ కావటంతో ఇక లాంఛనమే అనుకున్నారంతా. కానీ, అలా జరగలేదు. అందుకు సీఎం రేవంత్ రెడ్డే కారణం అని ఓ రూమర్ ఉంది. అదే సమయంలో.. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్‌తోనే ఉంటానని, డీకేతో భేటీ స్నేహపూర్వకమైనదేనని మల్లారెడ్డి కొట్టిపారేశారు.

కానీ, ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి దృష్టి అటువైపు మళ్లిందని సమాచారం. ఎలాగైనా తెలంగాణ సైకిల్ హ్యాండిల్ పట్టుకొందామని డిసైడ్ అయినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడారని, ఆయన కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో కానీ.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో చేరడంతో పాటు, తెలంగాణ పార్టీ పగ్గాలు చేపడితే రేవంత్ రెడ్డికి కూడా చెక్ పెట్టవచ్చన్న కారణం అని చర్చించుకుంటున్నారు. టీడీపీలో చేరితే రేవంత్ నుంచి ఇబ్బందులు ఉండవని, అందుకే మల్లారెడ్డి తన పాత పార్టీలోకే వెళతారని వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇక, టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన కూడా టీడీపీలోకి వెళ్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. తన కొడుకు భవిష్యత్తు దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది. మరికొన్ని నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో తన కుమారుడిని నిలబెట్టి, గెలిపించుకొని మేయర్ పీఠం సాధించే దిశగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ సర్కిళ్లలో చర్చించుకుంటున్నారు. సెటిలర్స్ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో టీడీపీ గెలుపు సాధించడం అసాధ్యమేమీ కాదని, అందుకే సైకిల్ ఎక్కేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితులు ఎవరిని ఎటువైపు నడిపిస్తాయో..! మాజీ మంత్రులు స్పందిస్తే గానీ ఈ వార్తలకు చెక్ పడేలా లేదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్