ఓ బీజేపీ ఎంపీ సహకారంతో రేవంత్ ఈ స్కాం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చారని వెల్లడించారు.
హైదరాబాద్, ఈవార్తలు : రేవంత్ సర్కారు భారీ ఆర్థిక నేరానికి తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హెచ్‌సీయూలోని 400 ఎకరాలు అటవీ భూమేనని, దాన్ని టీజీఐఐసీ తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో రేవంత్ ఈ స్కాం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చారని వెల్లడించారు. ఆ ఎంపీ పేరు తర్వాత చెప్తా. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అయితే, ఇప్పుడు ఆ బీజేపీ ఎంపీ ఎవరు అనేది హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలా? లేక ఏపీకి చెందినవారా? లేక.. ఇతర రాష్ట్రాలకు చెందినవారా? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ అయ్యి ఉంటే.. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. అందులో డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ కుమార్, గోదాం నగేశ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ బీజేపీ ఎంపీ అని వ్యాఖ్యానించారంటే.. వాళ్లు మంత్రివర్గంలో లేనట్లే. అంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాదని స్పష్టం అవుతోంది. మరి మిగతా ఆరుగురిలో ఎవరు రేవంత్‌తో కలిసి హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ఉన్నారు? అన్న చర్చ జరుగుతోంది. డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, గోదాం నగేశ్, రఘునందన్ రావు స్థానిక ఎంపీలు కాదు. స్థానిక ఎంపీలు కాకపోయినా.. వీరి ప్రమేయం ఉంటుందా? అంటే స్పష్టత రావాల్సి ఉంది.
ఇక.. మిగిలింది ఇద్దరు ఎంపీలు. అందులో ఒకరు ఈటల రాజేందర్, ఇంకొకరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వీరిద్దరు హైదరాబాద్ లోకల్ ఎంపీలు. వీరిద్దరిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక ఎంపీ. కంచ గచ్చిబౌలి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆ పార్లమెంట్ నియోజకవర్గానికే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. అంటే.. ఆయనే ఈ భూముల వ్యవహారంలో ఉన్నారా? అన్న సందేహం తలెత్తుతోంది. ఈ చిక్కుముడిని కేటీఆరే విప్పాలి. సెకండ్ ఎపిసోడ్‌లో కేటీఆర్ ఎవరు పేరు చెప్తారో మరి.