BRS | బీఆర్ఎస్ కేడర్‌లో పెరుగుతున్న జోష్.. సర్వేల ఫలితాలే కారణమా?

బీఆర్ఎస్ పని ఖతం అని అనుకున్నారు. కొందరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మద్దతుదారులను అధికార పార్టీ వేధింపులకు గురిచేస్తుందన్న వార్తలు వచ్చేసరికి నిజంగానే నిస్పృహలో కూరుకుపోయారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కవిత లిక్కర్ కేసు.. తదితర కేసులతో అధికార కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది.

kcr ktr
కేటీఆర్, కేసీఆర్

(ఈవార్తలు, సంపాదకీయం)

అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ భారత రాష్ట్ర సమితి (BRS Party) మళ్లీ పుంజుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నా.. లోకల్ కేడర్ మాత్రం బీఆర్ఎస్ వైపే ఉండటం ఆ పార్టీకి కలిసి రాబోతోంది. వాస్తవానికి కేసీఆర్‌కు ఝలక్ ఇవ్వాలని ఓ వర్గం ప్రజలు భావించారు. అయితే, ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని కోరుకున్నారు. ఎన్నికల్లో సీట్లు తగ్గాలని, కేసీఆర్ ఓ మెట్టు దిగి ప్రజల్లోకి రావాలని బలంగా కాంక్షించారు. అందుకు కారణం లేకపోలేదు.. పదేండ్ల పాలన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. కానీ, ఆ వ్యతిరేకతను తగ్గించేందుకు కేసీఆర్ ప్రయత్నించకపోవటమే కారణం. ఆ ప్రభావంతో బీఆర్ఎస్ ఏకంగా అధికారాన్నే కోల్పోవాల్సి వచ్చంది. అదే సమయంలో కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చేరటం, అధికార కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరించటం వల్ల బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని భావించారు. ఓ సమయంలో బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేస్తారన్న చర్చ కూడా జరిగింది.

గులాబీ కేడర్ కూడా డీలా పడిపోయింది. ఇక బీఆర్ఎస్ పని ఖతం అని అనుకున్నారు. కొందరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మద్దతుదారులను అధికార పార్టీ వేధింపులకు గురిచేస్తుందన్న వార్తలు వచ్చేసరికి నిజంగానే నిస్పృహలో కూరుకుపోయారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కవిత లిక్కర్ కేసు.. తదితర కేసులతో అధికార కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది. ఆ దిశగా అడుగులు కూడా వేసింది. ఈ చర్యలతో పార్టీ కేడర్ డిస్టర్బ్ అయ్యింది. వారికి ధైర్యం చెప్పేలా హరీశ్‌రావు, కేటీఆర్ చాలా కష్టపడ్డారు. ఓ క్రమంలో పోయేవాళ్లు పోనివ్వండి.. ఉన్నవాళ్లే మనవాళ్లు అని చెప్పాల్సి వచ్చింది.

సరిగ్గా.. అదే సమయానికి నాగార్జున సాగర్‌, శ్రీశైలం డ్యాంలను కేంద్రానికి అప్పగిస్తూ రేవంత్ సర్కారు తీసుకున్న చర్యల ఫలితంగా కేసీఆర్ తన ఆలోచనలకు పదును పెట్టారు. ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకొనేందుకు సరైన అవకాశం ఆయనకు దొరికింది. అదీకాక.. రాష్ట్రంలో కరువు పరిస్థితులు మొదలయ్యాయి. సాగునీళ్లు లేక పంటలన్నీ ఎండిపో సాగాయి. తాను తెచ్చిన తెలంగాణ మళ్లీ ఆగం అవుతుందని తలచిన కేసీఆర్ కార్యరంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నారు. నల్లగొండలో సభ పెట్టి పదునైన మాటలతో రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. అప్పుడే కేడర్‌లో కొద్దిగా ఆశపుట్టింది.

కరీంనగర్ సభ తర్వాత కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ టైంలో సైలెంట్‌గా ఉన్న కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందుగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చారు. ఈ సీట్ల కేటాయింపులోనూ బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నది. ఏకంగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కడియం కావ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తెచ్చుకోవటం లాంటి పరిణామాలు మరోసారి బీఆర్ఎస్‌ను దెబ్బతీశాయి. అయతే, కేడర్ మాత్రం ఎటూ వెళ్లలేదు. ఎందుకంటే.. కేసీఆర్ చేసిన అభివృద్ధిపై వారికున్న నమ్మకం. కేసీఆర్ ఏదైనా చేసి మళ్లీ పగ్గాలు చేపడతారన్న భరోసా. తన మెదడుకు పదును పెట్టిన కేసీఆర్.. చక్కని వ్యూహాన్ని అమలుచేశారు. ప్రజలు సాగు, తాగు నీళ్లతో గోసపడుతున్నారని గ్రహించి జనగామ, భువనగిరి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో పొలంబాట పట్టారు. దీంతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం లేచొచ్చింది. ప్రజల నుంచి కేసీఆర్‌కు లభించిన ఆదరణ వారికి వెయ్యేనుగుల బలాన్ని తెచ్చింది.

మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి ‘కేసీఆరే బాగుండే’ అని చర్చించుకోవటం మొదలుపెట్టారు. రైతులైతే పదేళ్ల తర్వాత గడ్డు పరిస్థితులను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు పోయే.. రైతుబంధు పోయే.. రైతుబీమా రాకపోవట్టే.. అని నిట్టూర్చారు. సాగునీళ్లు, తాగు నీళ్లు కూడా లేకపోయేనని బాధపడ్డారు. ఓవైపు పంటలు ఎండిపోవటం, మరోవైపు కేసీఆర్ టార్గెట్‌గా అధికార కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరించటం రైతుల్లో కోపాన్ని తెప్పించింది. రైతులు బాధపడుతుంటే రాజకీయాలా? అని ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఈ పర్యవసానాల ఫలితంగా డీలా పడిపోయిన బీఆర్ఎస్.. నిట్టనిటారుగా బరిలో నిలబడింది.

కాంగ్రెస్ నాలుగు నెలల పాలన ఎఫెక్ట్ కావచ్చేమో.. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు నిలుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తాజాగా నిర్వహించిన సర్వేల ఫలితాలే కారణం. రాష్ట్రంలో బీఆర్ఎస్ 6-10 లోక్‌సభ సీట్లు గెలుచుకొనే అవకాశాలున్నట్లు ఓ సర్వేలో తేలింది. దీన్ని గ్రహించిన కేసీఆర్.. ప్రజల ఓటును కారు గుర్తువైపు తిప్పేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన.. రెండు, మూడు రోజుల్లో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇక  బీజేపీ పైకి గంభీరంగా కనిపిస్తున్నా, ప్రజల ఓటును తమకు అనుకూలంగా మలుచుకోగలిగేంత ప్రభావం ఉంటుందా? అని అనుమానం కలుగుతోంది. కేంద్రంలోనూ బీజేపీ ఫలితాలు అంతంత మాత్రమేనని పలు సర్వేలు చెప్తున్నాయి. సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా, గెలిచేది మాత్రం తామేనంటోంది కమలం పార్టీ. ఇలా మూడు ముక్కలాటలో.. ఓవైపు ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్, ఇంకోవైపు ఓటు బ్యాంకును సంపాదించాలన్న ప్రయత్నంలో బీజేపీ ఉండగా.. ఇంకోవైపు సర్వే ఫలితాలను నిజం చేసేందుకు కేసీఆర్ పదునైన వ్యూహాలను రచిస్తున్నట్లు తెలిసింది. సర్వే ఫలితమే నిజమైతే.. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడే అవకాశాలున్నాయి.

వెబ్ స్టోరీస్