బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తట్టా బుట్టా సర్దుకొని హస్తం పార్టీ పంచన చేరారు. అప్పటిదాకా కేసీఆర్‌ను ఆహా.. ఓహో.. అంటూ పొగిడిన పోచారం.. ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించే సరికి ప్రజల్లో అసహనం మొదలైంది.
పోచారం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ఈవార్తలు : బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తట్టా బుట్టా సర్దుకొని హస్తం పార్టీ పంచన చేరారు. అప్పటిదాకా కేసీఆర్‌ను ఆహా.. ఓహో.. అంటూ పొగిడిన పోచారం.. ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించే సరికి ప్రజల్లో అసహనం మొదలైంది. ప్రజా ప్రభుత్వానికి మంచి చేద్దామన్న ఉద్దేశంతోనే తాను ప్రభుత్వ సలహాదారుగా ఉంటానని చెప్పుకొచ్చినా.. ఎవరూ నమ్మలేదు. ఒకానొక సందర్భంలో పార్టీ ఎందుకు మారాను? అన్న సంశయంలో ఆయన పడిపోయారని సన్నిహితులే చెప్పడం గమనార్హం. అయితే, పార్టీ మారిన చెడ్డపేరు తుడిచిపెట్టుకొనేందుకు ఆయన నానాతంటాలు పడుతున్నారు. తాజాగా, ఆరు గ్యారెంటీల్లో భాగంగా .. గ్రామ సభల్లో పలు పథకాల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు గ్రామ సభకు వెళ్లిన ఆయనపై.. ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేయకుండా అనర్హులను, కాంగ్రెస్ కార్యకర్తలను ఎలా ఎంపిక చేస్తారని ఓ వ్యక్తి నిలదీశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోచారం మాట్లాడుతున్నా వినిపించుకోకుండా ఆ వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఇలా.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పోచారం కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. ప్రభుత్వ సలహాదారుగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే, రాజీనామాకు అనుచరులు ఒప్పుకోవడం లేదని సమాచారం. దీంతో.. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పోచారం నిర్ణయించుకున్నట్లు తెలిసింది.