భారత్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కేంద్రానికి మెటా హెచ్చరిక

భారత్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా? కేంద్రం తీసుకొచ్చిన ఐటీ నిబంధనలే ఇందుకు కారణమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చాటింగ్, కాల్స్, వీడియోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు వంటి వాటిని గోప్యంగా ఉంచే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తీసేయాలని ఒత్తిడి చేస్తే భారత్‌లో తమ సేవలు నిలిపివేస్తామని వాట్సాప్ హెచ్చరించింది.

whatsapp in india
ప్రతీకాత్మక చిత్రం

Whatsapp Ban in India | భారత్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా? కేంద్రం తీసుకొచ్చిన ఐటీ నిబంధనలే ఇందుకు కారణమా?  అంటే అవుననే సమాధానం వస్తోంది. చాటింగ్, కాల్స్, వీడియోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు వంటి వాటిని గోప్యంగా ఉంచే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తీసేయాలని ఒత్తిడి చేస్తే భారత్‌లో తమ సేవలు నిలిపివేస్తామని వాట్సాప్ హెచ్చరించింది. కేంద్రం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌) రూల్స్‌-2021లోని 4(2) నిబంధనను సవాల్‌ చేస్తూ వాట్సాప్‌ పేరెంట్ సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నిబంధన ప్రకరాం.. ఏదైనా పోస్ట్‌ లేదా మెసేజ్‌ మొదట ఎవరి వద్ద నుంచి వచ్చింది? ఎవరు దాని సృష్టికర్త? అనేది సోషల్‌ మీడియా సంస్థలు గుర్తించాలి. అలా చేయాలంటే కోట్ల మెసేజ్‌లను ఏళ్ల తరబడి స్టోర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిబంధనలు లేదని మెటా తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పైగా ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ విధానానికి విఘాతం కలుగుతుందని వివరించారు. 

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ వల్ల చాటింగ్, సమాచారం, ఫైల్స్‌ వంటివి రహస్యంగా ఉంటాయన్న నమ్మకంతోనే భారత్‌లో కోట్ల మంది వినియోగదారులు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారని, దీనికి భంగం కలిగిస్తే తమపై వినియోగదారుల నమ్మకం దెబ్బతింటుందని కోర్టుకు వెల్లడించారు. కాదు కూడదు అంటే వాట్సాప్‌ భారత్‌ను వదిలి వెళ్తుందని తెలిపారు. 4(2) నిబంధన వ్యక్తుల గోప్యతకు వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. 2021 ఫిబ్రవరిలో కేంద్రం ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని సోషల్‌ మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. దీంతో ఆ నిబంధనను వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

వెబ్ స్టోరీస్