దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన తాజా పరికరం మన మెదడును నియంత్రిస్తుందట. అంటే.. మనం ఏ పని చేయాలన్నా ఆ యంత్రం ఆదేశానుసారమే కాబోతుందన్న మాట.
ప్రతీకాత్మక చిత్రం
మనకు అనువుగా ఉండాలని, పనులన్నీ ఈజీగా అయిపోవాలని యంత్రాలను తయారుచేసుకున్నాం. నీళ్ల మోటర్ నుంచి మొదలుపెట్టి రోబో వరకు అన్నీ ఈ కోవలోనివే. మన ఆదేశాలను పాటించి పనిచేయటం వాటి పని. కానీ, మనిషి రానురానూ యంత్రం ఆదేశాలను పాటించే మరో యంత్రంగా మారిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అందుకు ఉదాహరణే.. శాస్త్రవేత్తల తాజా సృష్టి. దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన తాజా పరికరం మన మెదడును నియంత్రిస్తుందట. అంటే.. మనం ఏ పని చేయాలన్నా ఆ యంత్రం ఆదేశానుసారమే కాబోతుందన్న మాట. అయితే, ఇప్పుడే అంత ఆందోళన చెందాల్సిన పని లేకున్నా, రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి వస్తుంది.
వివరాల్లోకెళితే.. కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బేసిక్ సైన్స్ (ఐబీఎస్) శాస్త్రవేత్తలు మస్తిష్కాన్ని నియంత్రించే రిమోట్ డివైజ్‌ను తయారుచేశారు. అయస్కాంత క్షేత్రాల ద్వారా మెదడును మ్యానిపులేట్ చేసి తన నియంత్రణలోకి తీసుకొనేలా ఈ పరికరాన్ని రూపొందించారు. ఆడ ఎలుకలపై చేసిన పరిశోధనల్లో సత్ఫలితాలు రావటంతో, వైద్యరంగంలో అతి సూక్ష్మ శస్త్రచికిత్సల్లో దీన్ని ఉపయోగించే దిశగా పరిశోధకులు ప్లాన్ చేస్తున్నారు. ఐబీఎస్ సెంటర్ ఫర్ నానోమెడిసిన్ డైరెక్టర్, రిసెర్చర్ డాక్టర్ చియోన్ జిన్‌వూ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తొలిసారి ఈ టెక్నాలజీని ఉపయోగించామని తెలిపారు.
ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్‌గానే ఉన్న ఈ సాంకేతికతను వైద్య రంగంలో ఉపయోగించుకోనున్నట్టు వెల్లడించారు. మెదడు పనితీరు, కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్స్, టు వే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీస్, నాడీ సంబంధ వ్యాధుల కోసం ఉపయోగపడుతుందని తాము భావిస్తున్నట్టు వివరించారు. అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి జీవ సంబంధ వ్యవస్థలను విజయవంతంగా మ్యానిపులేట్ చేయగలిగామని పేర్కొన్నారు. ఈ టెక్నిక్‌ను మ్యాగ్నెటో-మెకానికల్ జెనెటిక్స్ అని పిలుస్తున్నట్టు తెలిపారు.