డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న రోబోను అభివృద్ధి చేసిన టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు.. అచ్చం మనిషిలాగే డ్రైవ్ చేస్తాడని చెప్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
టోక్యో, జూలై 16: కారున్నా.. నడపలేని స్థితిలో ఓ డ్రైవర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. పెద్దపెద్ద వ్యాపారులకూ డ్రైవర్లు అవసరమే. వాళ్లే స్వయంగా డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడరు. డ్రైవర్ కోసం మార్కెట్‌లో వెతికినా.. నైపుణ్యం ఉన్నవాళ్లు దొరుకుతారా? అని ఒక అనుమానం. దొరికినా వేలకు వేలు అడుగుతారన్న బాధ. ఇలాంటి బాధలేవీ లేకుండా ఏంచక్కా డ్రైవర్ లెస్ కారు కొనుక్కుందామన్నా.. దాని టెక్నికల్ సిస్టమ్ సరిగా పనిచేస్తదో లేదోనన్న మరో అనుమానం. భారత్ లాంటి దేశాల్లో డ్రైవర్ లెస్ కారు నడపటం అంత ఈజీ కాదు. రద్దీ ప్రదేశాల్లో టెక్నికల్ సిస్టం ఫెయిల్ అయినా, సందర్భోచితంగా స్పందించకపోయినా భారీ ప్రమాదాలే జరుగుతాయి. అయితే, ఈ బాధలేవీ లేకుండా రోబోనే డ్రైవర్‌గా పెట్టుకోవచ్చంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న రోబోను అభివృద్ధి చేసిన టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు.. అచ్చం మనిషిలాగే డ్రైవ్ చేస్తాడని చెప్తున్నారు. మనిషిని పోలినట్టే ఉండే ఈ రోబో పేరు ముసాషి. ఈ రోబో మనం నడిపే కారును డ్రైవ్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ రోబో ఆవిష్కరణ రాబోయే కాలంలో స్వయంచాలక డ్రైవింగ్ వ్యవస్థలో గొప్ప అడుగు అవుతుందని వెల్లడించారు.
ముసాషి ప్రత్యేకతలు
- ఈ రోబోకు 39 జాయింట్లు, 74 కండరాలు ఉంటాయి.
- ప్రతి చేయికి 5 వేళ్లు ఉంటాయి. చేతులు, కాళ్లకు ప్రెజర్ సెన్సర్లు అమర్చారు.
- హ్యాండ్ బ్రేక్ వాడటం, ఇగ్నిషన్ కీ ఆన్ చేయటం, పెడల్స్ తొక్కడం, స్టీరింగ్ తిప్పడం, ఇండికేటర్లు వాడుకోవటం లాంటి పనులు కూడా చేస్తుంది.
- రోబో రెండు కళ్లలో హై రిజొల్యుషన్ కెమెరాలను అమర్చారు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అనుసంధానించి ఉంటాయి.
- ఈ కళ్ల ద్వారా మిర్రర్ చూస్తూ రోబో కారు డ్రైవ్ చేస్తుంది. ట్రాఫిక్ లైట్లు మారడం, పాదాచారుల నడకను గుర్తించటం లాంటివి చూస్తుంది.
- ప్రస్తుతానికి ముందుకు, కుడి వైపు మాత్రమే చూసి నడపగలదు. అది కూడా గంటలకు 3 మీటర్ల వేగంతో.
- త్వరలోనే సాధారణ మనిషిలా డ్రైవ్ చేసే స్కిల్స్ నేర్పిస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.