పర్యావరణ అనుకూల సౌర విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఫలితాలను ఇస్తోంది. గత పదకొండేళ్లలో దేశంలో సౌరశక్తి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పీఎం-కుసుమ్, పీఎం సూర్య ఘర్ వంటి పథకాలు ఇందుకు దోహదపడుతున్నాయి.
సౌర విద్యుత్
- 2014లో 3 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
- 2025 నాటికి 129 గిగావాట్లకు పెరిగిన ఉత్పత్తి
- కేంద్ర ప్రభుత్వ పథకాలతో భారీ పెరుగుదల
- సౌర విద్యుత్ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఇండియా
- శిలాజేతర ఇంధన సామర్థ్యంలోనూ ముందంజ
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల సౌర విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఫలితాలను ఇస్తోంది. గత పదకొండేళ్లలో దేశంలో సౌరశక్తి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పీఎం-కుసుమ్, పీఎం సూర్య ఘర్ వంటి పథకాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గ్రామాల్లో వ్యవసాయ పంప్‌సెట్‌ల నుంచి నగరాల్లో ఇంటిపైకప్పు వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం భారీగా పెరుగుతోంది. 2014లో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం కేవలం 3 గిగావాట్లు ఉండగా, ఇప్పుడు 40 రెట్లు పెరిగి 129 గిగావాట్లకు చేరడమే ఇందుకు ఉదాహరణ. దీంతో సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. సౌర విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో మొత్తం శిలాజేతర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సైతం భారత్ వేగంగా పెంచుకొని 259 గిగావాట్లకు తీసుకెళ్లింది. ఇది దేశంలోని మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50 శాతానికి పైనే.
పీఎం సూర్య ఘర్ పథకంతో ప్రోత్సాహం
గృహ విద్యుత్ వినియోగంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కోటి గృహాలకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా రూ.75,021 కోట్ల వ్యయంతో గత ఏడాది ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 23.9 లక్షల గృహాలపై రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. ఇందుకు కేంద్రం రూ.13,464.6 కోట్ల సబ్సిడీని విడుదల చేసింది.
పీఎం-కుసుమ్‌తో వ్యవసాయానికి సౌరశక్తి
వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం 2019లో ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఈవమ్ ఉత్తమ్ మహాభియాన్(పీఎం-కుసుమ్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9 లక్షల స్టాండలోన్ సోలార్ పంపుసెట్లు ఏర్పాటయ్యాయి. గ్రీడ్‌కు అనుసంధానంగా మరో 10,535 సోలార్ పంప్‌సెట్లను రైతులు ఏర్పాటు చేసుకున్నారు. మరో9.74 లక్షల ఫీడర్ స్థాయి సోలార్ పంపులు ఏర్పాటయ్యాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. 15 హెచ్‌పీ వరకు సౌర విద్యుత్ పంపుసెట్లకు కేంద్రం సబ్సిడీని అందిస్తోంది.
భారీ ఎత్తున సోలార్ పార్కులు
దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సోలార్ పార్కులు, అల్ట్రా-మెగా సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటే లక్ష్యంగా కేంద్రం 2014 డిసెంబర్‌లో ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఇప్పటివరకు 13 రాష్ట్రాల్లో 39,973 మెగావాట్ల సామర్థ్యంతో 55 సోలార్ పార్కుల ఏర్పాటుకు అనుమతి లభించింది. ఇప్పటికే 14,922 మెగావాట్ల సామర్థ్యంలో కూడిన సోలార్ పార్కుల నిర్మాణం పూర్తై విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.
సోలార్ పీవీల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు
సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన సోలార్ ఫొటోవొల్టాయిక్ మాడ్యూళ్ల దిగుమతిని తగ్గించి, దేశంలోనే ఉత్పత్తి అయ్యేలా ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.24,000 కోట్లతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్(పీఎల్ఐ) పథకాన్ని ప్రారంభించింది. సోలార్ పీవీ మాడ్యూళ్లు ఉత్పత్తి చేసే సంస్థలకు ఈ పథకం కింద కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తోంది.
ప్రపంచానికి ఆదర్శం
అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) వ్యవస్థాపక సభ్య దేశంగా సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. 125 సభ్య దేశాలు కలిగిన ఈ కూటమి ప్రధాన కార్యాలయం సైతం భారత్‌లోని గురుగ్రామ్‌లోనే ఉంది. ద్వారా ఇతర దేశాలకు సైతం ఈ రంగంలో భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో పాటు పునరుత్పాదక విద్యుత్ గ్రిడ్‌ల అనుసంధానంపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్(ఓఎస్ఓడబ్ల్యూఓజీ) అనే నినాదం సైతం మన్ననలు పొందింది.
- సౌర విద్యుత్ ఉత్పత్తిలో 3వ స్థానంలో భారత్
- పవన విద్యుత్ ఉత్పత్తిలో 4వ స్థానంలో భారత్
- మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో 4వ స్థానంలో భారత్
భారత్‌లో సౌర విద్యుత్ సామర్థ్యం:
2014 - 3 గిగావాట్లు
2025 - 129 గిగావాట్లు