ఈ నెల 29న సూర్యగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సూర్య గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతోంది? అని సందేహపడుతున్నారు.
ఈవార్తలు, తెలంగాణ: ఈ నెల 29న సూర్యగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సూర్య గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతోంది? అని సందేహపడుతున్నారు. అయితే, ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ భూమి నుంచి పాక్షికంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, గ్రీన్ ల్యాండ్, ఐలాండ్ ఈ గ్రహణాన్ని చూడవచ్చని వెల్లడించారు. భారత్‌పై మాత్రం గ్రహణ ప్రభావం ఉండబోదు. గ్రహణ సమయంలో చంద్రుడి నీడ భారతదేశం గుండా పోదని వివరించారు.
అయితే, కొందరు లాభాపేక్షతో సూర్య గ్రహణ ప్రభావం భూమిపై కూడా ఉందని, శాంతి పూజ చేయాలని చెప్పడంపై ప్రముఖ పురోహితుడు, జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన రామ్ మనోహర్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు డబ్బు ఆశతో ప్రజలను ఎన్ని రకాలగా అయోమయానికి గురి చేయాలో అన్ని రకాలుగా గురిచేస్తున్నారని మండిపడ్డారు. సంవత్సరం పొడవునా అనేక గ్రహణాలు ఉంటాయని, ప్రాంతాలను బట్టి మన దగ్గర లేని గ్రహణాన్ని ప్రచారం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. ఈ నెల 29న కూడా పాక్షిక గ్రహణం ఏర్పడుతున్నా.. దాని ప్రభావం భారతదేశంపై లేదని స్పష్టం చేశారు. కొందరు సూర్యగ్రహణం పేరుతో మోసం చేయాలని చూసే అవకాశాలున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.