శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చిచ్చు రేగింది. తాజాగా ఆయన కుమార్తెలు ఇద్దరూ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఇన్చార్జిగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గ నుంచి కింజరాపు అచ్చం నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన కుమార్తెలు నిరసన
శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చిచ్చు రేగింది. తాజాగా ఆయన కుమార్తెలు ఇద్దరూ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఇన్చార్జిగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గ నుంచి కింజరాపు అచ్చం నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కు, కింజరాపు అచ్చం నాయుడుకు మధ్య విభేదాలు తారస్థాయిలోనే ఉన్నాయి. వైసిపి అధికారంలో ఉండగా దువ్వాడ శ్రీనివాస్ అనేక సందర్భాల్లో అచ్చం నాయుడుపై నోటి దురుసును ప్రదర్శించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ చిచ్చు రేగింది. దువ్వాడ శ్రీనివాస్ కు కొన్నాళ్ల కిందటే వాణితో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ వాణి మధ్య విభేదాలు తలెత్తడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు వాణి అనేక సందర్భాల్లో ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా దువ్వాడ వాణి జగన్మోహన్ రెడ్డి వద్ద పంచాయతీ పెట్టింది. స్థానిక నాయకులను కొందరిని తీసుకుని వెళ్లి తనకే టికెట్ ఇవ్వాలని కోరింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆమెనే ఇన్చార్జిగా నియమించారు.
అయితే, ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాలను పరిశీలించిన ఆయన టికెట్ ను మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ కు కేటాయించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో దువ్వాడ శ్రీనివాస్ పై కింజరాపు అచ్చం నాయుడు విజయం సాధించారు. ప్రస్తుతం ఎన్నికల ముగియడంతో రాజకీయ వేడి తగ్గుముఖం పట్టింది. అయితే, దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మాత్రం అగ్గి రాజుకుంది. అకస్మాత్తుగా గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్, వాణి కుమార్తెలు హైందవి, నవీన తన తండ్రి కొద్ది రోజుల కిందట నిర్మించుకున్న ఇంటి వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు. బయటికి రావాలంటూ మౌన పోరాటానికి దిగారు. తమ తల్లిదండ్రులు చట్టపరంగా ఇప్పటికీ విడాకులు తీసుకోలేదని ఈ సందర్భంగా కుమార్తెలు తెలిపారు. నాన్న బయటకు రావాలంటూ ఈ సందర్భంగా వారు కోరారు. అయినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ బయటకు రాలేదు. గేట్లు వేసేయడంతో కుమార్తెలు ఇద్దరూ అక్కడే కొద్ది నిమిషాలపాటు నిరసన తెలియజేసి వెనక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ వ్యవహారం కావడంతో వైసిపి నాయకులు కూడా ఎవరు జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఎలా బయటపడతారన్న చర్చ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారాలను చక్కదిద్దుకోలేక రాజకీయంగా చతికిల పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి ఆయన బయటపడిన తర్వాత రాజకీయంగా ఆలోచన చేయాల్సి ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.