వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన వెంట వేలాది మంది వైయస్సార్ అభిమానులు నిలబడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఏళ్ల నుంచి అండగా ఉంటూ వచ్చిన అనేక వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసాయి. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దయనీయస్థితిలోకి వెళ్లిపోయింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన వెంట వేలాది మంది వైయస్సార్ అభిమానులు నిలబడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఏళ్ల నుంచి అండగా ఉంటూ వచ్చిన అనేక వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసాయి. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దయనీయస్థితిలోకి వెళ్లిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి చవి చూడగా, ఒకసారి అధికారాన్ని దక్కించుకుంది ఆ పార్టీ. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో విజయాన్ని దక్కించుకున్న వైసిపి.. ఐదేళ్లలో జరిగిన ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితుల్లో వైసిపి మళ్లీ కోల్పోవడం కష్టం అన్న భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో.. మరోసారి పార్టీని పటిష్టం చేయడంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ, పార్టీకి అండగా అనేక వర్గాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
దీనికి ఉదాహరణగా పార్టీకి వచ్చిన 40 శాతం ఓటు బ్యాంకు తోపాటు గెలిచిన నాలుగు ఎంపీ స్థానాలు గురించి ఆ పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో మరిన్ని వర్గాలు పార్టీకి అండగా ఉంటాయని, 2029 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయంగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలకు సమర్థులైన పార్టీ అధ్యక్షులు లేరని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బలమైన నాయకులను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వలసలను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నారు. వచ్చే నెలాఖరు నాటికి పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చి కొత్త వారికి అవకాశాలు కల్పించనున్నారు. అదే సమయంలో నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను కూడా నియమించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాలకు దూరంగా ఉంటూ వస్తున్న వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి పునరాలోచించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడం ద్వారానే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి భావిస్తూ అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా నియామకాలను చేపట్టనున్నారు.