||రాహుల్ గాంధీ, వీర్ సావర్కర్, రంజిత్ సావర్కర్||
ఈవార్తలు, నేషనల్ న్యూస్: హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా మండిపడ్డారు. తన తాత గురించి తప్పుగా మాట్లాడినందుకు రాహుల్‌పై నిప్పులు చెరిగారు. వీర్ సావర్కర్ దేశభక్తుడని, ఆయన ఎప్పుడూ బ్రిటిష్ వాళ్లకు క్షమాపణ చెప్పలేదని స్పష్టం చేశారు. ‘వీర్ సావర్కర్ ఎప్పుడు క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలను నిరూపించాలి. దానికి సంబంధించిన పత్రాలు చూపించాలి’ అని రాహుల్‌కు సవాల్ విసిరారు. రాహుల్ వ్యాఖ్యలు పిల్లల మాటల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రచారం కోసం దేశభక్తుల పేర్లు వాడుకోవటం ఏమిటని రాహుల్‌ను రంజిత్ సావర్కర్ నిలదీశారు. ఇది చాలా పెద్ద నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు.
‘మోసగాళ్లంతా తమ ఇంటిపేరును మోదీగా ఎందుకు పెట్టుకుంటారు?’ అని కర్ణాటకలో 2019 ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం కూడా రద్దయ్యింది. ఈ నేపథ్యంతో తన అనర్హత వేటుపై ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. క్షమాపణలు చెప్పటానికి తానేమైనా సావర్కర్‌నా? గాంధీ కుటుంబం నుంచి వచ్చినవాడిని అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.