ఆదివారం కూల్చివేతలు ఎందుకు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు సూటి ప్రశ్న

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఆదివారం రోజున కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని నిలదీసింది.

hydra high court

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు చీవాట్లు

హైదరాబాద్, ఈవార్తలు : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఆదివారం రోజున కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని నిలదీసింది. అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పాలని ప్రశ్నించింది. శనివారం నోటీసులు ఇచ్చి.. ఆదివారం ఉదయం కూల్చివేస్తారా? సెలవు రోజు కూడా అవకాశం ఇవ్వరా? సోమవారం వరకు ఆగలేకపోయారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. హైడ్రా కూల్చివేతలపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ.. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేపట్టారని ప్రశ్నించింది. చట్టాన్ని అనుసరిస్తున్నారా? లేక పత్రికలు చెప్పినట్లు వింటున్నారా? అని నిగ్గదీసింది. చార్మినార్‌ను కూల్చివేయాలని ఎమ్మార్వో చెప్తే కూల్చేస్తారా? అని ప్రశ్నించింది. 

హైకోర్టు కామెంట్స్ ఇవీ..

- మీరు (హైడ్రా) చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేపడుతున్నారు.

- చార్మినార్‌ను అక్కడి ఎమ్మార్వో కూల్చివేయాలని చెప్తే కూల్చేస్తారా?

- నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. వేరే చెప్పకండి

- అమీన్‌పూర్‌పై మాత్రమే మాట్లాడండి. కావూరి హిల్స్ గురించి నేను అడగటం లేదు

- అక్రమ కట్టడాలు కడుతుంటే ఆపండి లేదా సీజ్ చేయండ

- నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం కూల్చివేతలు చేపట్టడం ఏంటి?

- ఆదివారం ప్రశాంతంగా కుటుంబంతో గడిపే అవకాశం ఇవ్వరా?

- అధికారులు కక్ష గట్టి కూల్చివేతలు చేపడుతున్నారు.

- ఆదివారం కూల్చివేతలు చేపట్టి సాధారణ పౌరులకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు?

- హైడ్రాకు అభినందనలు. కానీ వ్యవహారమే బాగోలేదు. ఇలాంటి చర్యలపై సంతోషంగా లేము

- అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామపంచాయతీ స్పందించాలి. గ్రామపంచాయతీ చర్యలు తీసుకోవాలి. నిబంధనలు అనుసరించాలి.

- తహసీల్దార్, హైడ్రా కౌంటర్ దాఖలు చేయాలి

- హైడ్రా కమిషనర్ వాదనలతో కోర్టు ఏకీభవించడం లేదు

- అందరినీ చంచల్‌గూడ, చర్లపల్లి పంపిస్తే అప్పుడు అర్థం అవుతుంది.

- హైడ్రా ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దు. పెద్ద, పేద ప్రజల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా?

- ట్రాఫిక్ కు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు?

- మూసీ విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటి?

- ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జీవో 99పై స్టే విధించాల్సి వస్తుంది.

- కోర్టు పరిధిలో ఉన్న భవనాలను హైడ్రా కూల్చడం ఏంటి?


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్