రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంత వరకు ప్రారంభించలేదు. కొద్దిరోజుల్లోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి కసరత్తు చేస్తున్నారు. మిగిలిన నామినేటెడ్ పోస్టులతో పోలిస్తే దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన టిటిడి చైర్మన్ పోస్ట్ కు మాత్రం తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది.
అశోక్ గజపతిరాజు, అశ్విని దత్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంత వరకు ప్రారంభించలేదు. కొద్దిరోజుల్లోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి కసరత్తు చేస్తున్నారు. మిగిలిన నామినేటెడ్ పోస్టులతో పోలిస్తే దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన టిటిడి చైర్మన్ పోస్ట్ కు మాత్రం తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఈ పోస్టును దక్కించుకునేందుకు పలువురు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. టీటీడీ చైర్మన్ రేస్ లో ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. టీటీడీ చైర్మన్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ఖరారైనట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, దీనిని నాగబాబు ఖండించారు. ఆ తరువాత మాజీ కేంద్రమంత్రి విజయనగరం పూసపాటి అశోక్ గజపతి రాజు పేరు వినిపించింది. టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు దాదాపు ఖరారైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో మళ్లీ స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు భర్తీ వ్యవహారంపై జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పోస్ట్ భర్తీపైనా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ పోస్టును వాళ్లకే ఇస్తున్నారు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పేర్లతో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉన్నప్పటికీ వీరిలో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు టిడిపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో కేంద్ర పౌర విమానాయాను శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజుకి ఈ బాధ్యతలను చంద్రబాబు నాయుడు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితంలో వివాదరహితంగానే మెలుగుతూ వచ్చారు. సౌమ్యుడు, ధార్మిక కార్యక్రమాలు పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో చంద్రబాబు నాయుడు ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ పోస్ట్ ను అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, నాగబాబు కూడా సైలెంట్ గా తనకు ఈ పదవిని కావాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం తన తమ్ముడు అయినా పవన్ కళ్యాణ్ వద్ద ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. టిటిడి చైర్మన్ రేస్ లో నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఈయనకు అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా తీవ్రస్థాయిలో ఆ పార్టీని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాలు వేదికగా తనదైన స్థాయిలో వైసీపీకి డామేజ్ చేసిన రఘురామకృష్ణంరాజు తొలుత ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే సామాజిక సమీకరణాలు, ఇతర లెక్కల ఆధారంగా చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించింది. అప్పటనుంచే కొంత అసంతృప్తిగా ఉన్నారు రఘురాం కృష్ణంరాజు.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్పీకర్ అవుతానని భావించారు. రఘురామకృష్ణం రాజుకు చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపించడంతో ఆయనలో అసహనం మరింత పెరిగిపోయింది. ఆయనను ఎంతో కొంత చల్లార్చి ఉద్దేశంతో ఈ పదవిని కట్టబెడతారని చెబుతున్నారు. అయితే, దీని పట్ల ఆయన ఎంతవరకు సానుకూలంగా వ్యవహరిస్తారన్నది తెలియాల్సి ఉంది. వీరితోపాటు మరో ఇద్దరు ముగ్గురు ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ఈ నలుగురిలో ఎవరికో ఒకరికి మాత్రమే అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. చూడాలి మరి కొద్ది రోజుల్లో టీటీడీ చైర్మన్ గా ఎవరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలను అప్పగిస్తారో.