తెలంగాణ పిసిసి చీఫ్ గా ఎవరికి అవకాశం దక్కేనో..! ఆ నేతకు సీఎం రేవంత్ హామీ

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. జోడు పదవులతో ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మరొకరిని నియమించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ అధ్యక్ష పీఠం కోసం పార్టీలో సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత నెలలోనే పిసిసి చీఫ్ నియామకం జరగాలి. అనివార్య కారణాల వల్ల నియామక ప్రక్రియ వాయిదా పడింది. మరింత జాప్యం జరిగితే పార్టీకి ఇబ్బంది కలుగుతుందన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

Revanth Reddy, Madhuyashki Goud

 రేవంత్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. జోడు పదవులతో ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మరొకరిని నియమించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ అధ్యక్ష పీఠం కోసం పార్టీలో సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత నెలలోనే పిసిసి చీఫ్ నియామకం జరగాలి. అనివార్య కారణాల వల్ల నియామక ప్రక్రియ వాయిదా పడింది. మరింత జాప్యం జరిగితే పార్టీకి ఇబ్బంది కలుగుతుందన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత వేగంగా పిసిసి ప్రెసిడెంట్ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమాయత్తమవుతోంది. పిసిసి చీఫ్ పోస్ట్ కు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ ప్రముఖంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మధుయాష్కి గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహేష్ కు ఎమ్మెల్సీ పదవిని ఆ పార్టీ కట్టబెట్టింది. ఆయనకి మరో పదవి ఎందుకని కొంతమంది ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న తనకు ఆ పదవులు ఇవ్వాలని మధుయాష్కి గౌడ్ కోరుతున్నారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి గిరిజన నేత, ఎంపీ బలరాం నాయక్ పేరును ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ప నిచేశారు. పార్టీకి అత్యంత విధేయుడు కావడంతో ఆయనకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలాగే ఎస్సీ వర్గీకరణపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాదిగ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు పిసిసి చీఫ్ పదవిని ఆ వర్గానికి ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు అప్పగించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఆయన కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారే కావడంతో సీఎం, పీసీసీ పోస్టులు ఒకే జిల్లాకు ఇవ్వడం కష్టం అన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నలుగురిలో ఎవరికో ఒకరికి పిసిసి లభిస్తుందా..? లేక అనూహ్యంగా తెరపైకి మరో నేత పేరు వస్తుందా.? అన్న దానిపై జోరుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదిలా, ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ తోపాటు ప్రచార కమిటీ చైర్మన్ వంటి పదవులకు ఒకేసారి పేర్లు ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంలో పదవులు సర్దుబాటు చేయలేని వారందరికీ పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తారని, అప్పుడు పేర్లు ఫైనల్ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 20 తర్వాత టిపిసిసి చీఫ్ ను నియమిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్