కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి ఆంతర్యం ఏమిటన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. కొద్దిరోజుల కిందట వినుకొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి ఆంతర్యం ఏమిటన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. కొద్దిరోజుల కిందట వినుకొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండ రాజకీయాలు, హత్యలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనంతరం గవర్నర్ ను కలిసి ఈ వ్యవహారాలపై ఫిర్యాదు కూడా చేశారు. అలాగే, బుధవారం ఢిల్లీ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలు, దాడులను నిరసిస్తూ ధర్నాకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వినుకొండలో హత్యకు గురైన రషీద్ వ్యవహారంపై ఆమె సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రషీద్ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆమె విమర్శలను గుప్పించారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఢిల్లీలో ఎందుకు దీక్ష చేయడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయ దాడులు, హత్యలు పెరుగుతున్నాయి అంటూ జాతీయ స్థాయిలో ధర్నాకు సిద్ధమవుతుంటే.. ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి మాత్రం ఈ తరహా దాడులు జరగలేదన్నట్లుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతంగా చేశారా..? లేక కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రాతిపదికగా చేశారా..? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
షర్మిల చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే బుధవారం ఢిల్లీలో జరగనున్న జగన్మోహన్ రెడ్డి దీక్షకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లభించే అవకాశం లేదని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి దగ్గర కాకుండా చేయడంలో భాగంగానే షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ దాడులు, హింస జరుగుతుందన్న విషయాన్ని షర్మిల కూడా అంగీకరిస్తే.. కూటమి ప్రభుత్వంపై జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటాన్ని చేసే అవకాశం ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతును పరోక్షంగానైనా, ప్రత్యక్షంగానైనా అందించేందుకు సిద్ధపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారని, తద్వారా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా నిలవకుండా చేస్తున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జాతీయస్థాయిలో ఒక ప్రత్యేక రాజకీయ విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
రాష్ట్రంలో బిజెపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బీజేపీకి తన మద్దతును ప్రకటిస్తూ వస్తున్నారు. ఇది రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బందులను కలిగించే అవకాశం ఉందన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండియా కూటమికి దగ్గరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదే జరిగితే రాజకీయంగా తనకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి దగ్గర కాకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగానే షర్మిల.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై భిన్నమైన వ్యాఖ్యలను చేసినట్లు చెబుతున్నారు. మరి బుధవారం జగన్మోహన్ రెడ్డి చేయనున్న దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుందా..? ఎవరినైనా పంపిస్తుందా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి దీక్ష అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు మలుపు తీసుకుంటాయో.