తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు. వృద్ధులకు నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదని, ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు. వృద్ధులకు నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదని, ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులోని ధర్నా చౌక్ వద్ద బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలను ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతినెల రూ.2500 ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు వారికి ఎందుకు చెల్లించలేదన్నారు. ఈ పథకాన్ని ఇప్పటివరకు అమలు చేయకపోవడం వల్ల ప్రతి మహిళకు ఈ ప్రభుత్వం రూ.20 వేల రూపాయల బాకీ పడిందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు అమలు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఈ పథకాన్ని కూడా ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన ఈ ప్రభుత్వం.. బస్సులను తగ్గించి మహిళలు ఇబ్బంది పడేలా చేస్తోందన్నారు. తెలంగాణ ఆడ బిడ్డల తరఫున ప్రశ్నించే బాధ్యత తాము తీసుకున్నామని, హామీలు అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తామన్నారు. కర్ణాటకలో కూడా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదని, రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ విధిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పర్యటనల కోసం పన్నులు ద్వారా వసూలు చేసిన సొమ్మును వినియోగిస్తున్నారని స్పష్టం చేశారు. పథకాలు అమలు పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్టు షాపులు మూయించాలన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్త రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదని, దీనివల్ల మహిళలు గ్యాస్ కనెక్షన్లు కూడా తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని, అప్పటి వరకు ప్రజా పక్షాన ఉంటూ తమ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి రావడం కోసం అనేక తప్పుడు హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, ప్రజాక్షేత్రంలోనే వాటిని నిలదీస్తామని స్పష్టం చేశారు.