ఆంధ్రప్రదేశ్ లో అదుపుతప్పిన శాంతి, భద్రతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యలను నిరసిస్తూ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ ధర్నా మరికొద్ది క్షణాల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభం కానుంది. ఈ ధర్నాలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తోపాటు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో అదుపుతప్పిన శాంతి, భద్రతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యలను నిరసిస్తూ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ ధర్నా మరికొద్ది క్షణాల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభం కానుంది. ఈ ధర్నాలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తోపాటు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మారణ హోమాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసే ఉద్దేశంతోనే ఈ ధర్నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చి 50 రోజులు గడవకముందే రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని, 16 అత్యాచారాలు జరిగాయని, 1000కిపైగా దాడులు, అంతకుమించి ఆస్తులను విధ్వంసం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ మేరకు పోస్టర్లను రిలీజ్ చేసి ఢిల్లీలో ధర్నా చేసే వేదిక వద్ద ఏర్పాటు చేసింది వైసిపి. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పయని వైసిపి ఆరోపిస్తోంది. పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ధర్నా చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ ఆరోపిస్తోంది. అందుకు అనుగుణంగానే ధర్నా వేదిక వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వినుకొండలో వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదని, ఒకరిద్దరిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని వైసీపీ ఆరోపించింది. ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ సమావేశం అయ్యేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఎంపీలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగినట్లు చెబుతున్నారు. వీలైతే రాష్ట్రపతిని కూడా కలిసేందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టడంతోపాటు వీలైతే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ తో ఈ ధర్నాకు వైసిపి సిద్ధమవుతోంది. అదే సమయంలో కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రానికి పంపించాలనీ వైసీపీ డిమాండ్ చేస్తోంది.