కోల్ కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి వీరంగం.. విధ్వంసం సృష్టించిన దుండగులు

పశ్చిమబెంగాల్లోని కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆర్జి కర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి తరువాత దుండగులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు దేశం అంతా నిరసనలు తెలియజేస్తుంటే మరోవైపు ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకు వచ్చి దాడులు చేశారు.

Medical supplies destroyed in hospital

ఆసుపత్రిలో ధ్వంసమైన వైద్య సామాగ్రి

పశ్చిమబెంగాల్లోని కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆర్జి కర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి తరువాత దుండగులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు దేశం అంతా నిరసనలు తెలియజేస్తుంటే మరోవైపు ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకు వచ్చి దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మందులు దుకాణం, ఔట్ పేషెంట్ విభాగాలతోపాటు సీసీ టీవీలను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు గురువారం కోల్ కతా పోలీసులు వెల్లడించారు. సుమారు 40 మంది వరకు నిరసనకారుల రూపంలో వచ్చిన దుండగులు ఆసుపత్రిలో విధ్వంసాన్ని సృష్టించారని, వీరి దాడిలో ఓ పోలీసు వాహనం సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందితోపాటు మరికొంతమంది భయాందోళన చెందినట్లు చెబుతున్నారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ఉపయోగించారు. ఆసుపత్రిపై దాడులతో రాష్ట్రంలో మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. అత్యాచారం జరిగిన ఆసుపత్రి గది ఆందోళనకారుల దాడిలో ధ్వంసం అయిందన్న వార్తలపై కోల్ కతా పోలీసులు స్పందించారు. నేరం జరిగిన సెమినార్ గది వద్దకు ఎవరు వెళ్లలేదని, ధ్రువీకరణ లేని వార్తలను వ్యాప్తి చేయొద్దంటూ స్పష్టం చేశారు.

వదంతులు వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిపై దుండగులు దాడి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పశ్చిమబెంగాల్ బిజెపి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. సిబిఐకి కేసు అప్పగించిన నేపథ్యంలో సాక్ష్యాలు చిక్కకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రిపైకి తృణమూల్ గుండాలను పంపించారని భాజపా నేత సువేందో అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను సీఎం మమతా బెనర్జీ కూడా తిప్పి కొట్టారు. దాడులు వెనక పలు రాజకీయ పార్టీల హస్తము ఉందని ప్రతి ఆరోపించారు. నిరసనలు చేపడుతున్న విద్యార్థులు, వైద్యులతో తనకు ఎటువంటి ఫిర్యాదు లేదని, కొన్ని రాజకీయ పార్టీలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఆసుపత్రిపై జరిగిన దాడులను భారత వైద్య సంఘం( ఐఎంఏ) తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై గవర్నర్ ఆనంద్ బోస్ కూడా స్పందించారు. ఆసుపత్రిపై దాడి సమాజానికి సిగ్గుచేటు అన్నారు. విధ్వంసం జరిగిన ఆసుపత్రిని గురువారం ఆయన సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ప్రజలతో ఉన్నానని, ఈ సమస్యను కలిసి పరిష్కరించుకుందామని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలోకి 40 మంది వరకు దుండగులు వచ్చినట్లు పోలీసులు చెబుతుంటే.. అక్కడ పని చేసిన కొంతమంది సిబ్బంది మాత్రం వేయి మంది వరకు వచ్చినట్లు చెబుతున్నారు. వచ్చిన వారు వచ్చినట్లుగా వీరంగం సృష్టించారని, కనిపించిన వారిపైన ప్రతాపం చూపించినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలియజేసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే, వీరిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దుండగులను ఎవరు పంపించారు అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశంతో ఈ దాడులకు తెగబడ్డారా..? లేకపోతే హత్యాచారానికి సంబంధించిన ఆధారాలను చెరిపేసేందుకే ఈ ప్రయత్నం చేశారా..? అన్నదానిపై విచారణలో స్పష్టత రానుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్