కూటమి అధికారంలోకి.. వైఎస్‌ఆర్‌ పేర్లు వెంటనే మార్పు

ఇదే క్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ చేసిన కొన్ని మార్పులను సరి చేసే పనిలో పడ్డారు. విజయవాడలోని హెల్త్‌ యూనివర్శిటీ పేరును రాత్రికి రాత్రే టీడీపీ శ్రేణులు మార్చేశారు.

Boards with changed names

మారిన పేర్లతో ఉన్న బోర్డులు


రాష్ట్రంలో కూటమి పార్టీలు అద్భుతమైన విజయాన్ని సాధించడంతో కూటమి పార్టీలకు చెందిన కేడర్‌ ఉత్సాహంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో విజయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నమోదు చేశాయి. వైసీపీ బొక్క బోర్లా పడింది. 151 స్థానాలు నుంచి 11 స్థానాలకు పడిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీలకు చెందిన శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ చేసిన కొన్ని మార్పులను సరి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే విజయవాడలోని హెల్త్‌ యూనివర్శిటీ పేరును రాత్రికి రాత్రే టీడీపీ శ్రేణులు మార్చేశారు. గతంలో హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్‌టీఆర్‌ విశ్వవిద్యాలయం అని పేరు ఉండేది. కొన్నాళ్లు కిందట వైఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయంగా పేరు మారుస్తూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ తరహా పేర్లు మార్పు మంచిది కాదని, ఎన్‌టీఆర్‌ పేరు మార్చడం తగదని హితవు పలికింది. అయినా వైసీపీ ప్రభుత్వం దీనిపై ముందుకే వెళ్లింది. కూటమి భారీ మెజార్టీ సాధించడంతో మంగళవారం సాయంత్రం పలువురు టీడీపీ నాయకులు వైఎస్‌ఆర్‌ అన్న పేరును తొలగించి ఆ స్థానంలో ఎన్‌టీఆర్‌ అన్న అక్షరాలను ఏర్పాటు చేశారు. గేటు ఎదురుగా ఉన్న శిలాఫలకంపై ఉన్న వైఎస్‌ఆర్‌ పేర్లను కాళ్లతూ తంతూ తొలగించారు. అదే విధంగా విశాఖలోని సీతకొండ దగ్గరలో వైసీపీ ప్రభుత్వం వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేసింది. దీనికి వైఎస్‌ఆర్‌ వ్యూ పాయింట్‌ అని పేరు పెట్టారు. దీనిపై అప్పట్లోనే పెద్ద దుమారం రేగింది. అబ్ధుల్‌ కలాం పేరును తొలగించి వైఎస్‌ఆర్‌ పేరును పెడుతున్నారని పలువురు విమర్శించారు. అయితే, ఇక్కడ కూడా రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్‌ఆర్‌ పేరు మీద అబ్ధుల్‌ కలాం పేరును అతికించి వ్యూ పాయింట్‌ పేరును మార్చారు. మార్చిన ఈ పేర్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్