ఏపీలో కూటమి అనుసరిస్తున్న విధానాలు, వైసిపి నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న దాడులు కారణంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫలితాలు విడుదలై నెల రోజుల కాకముందే రోడ్డుమీదకు రావాల్సిన పరిస్థితిని కూటమి నాయకులు సృష్టించారు. ఇది ఒక రకంగా వైసీపీకి ఇమేజ్ ను మళ్ళీ క్రియేట్ చేసినట్లు అయింది. కూటమి బాధతో ఇంట్లో కూర్చోవాల్సిన జగన్ ను మళ్ళీ రోడ్డు ఎక్కి మునుపటి మాదిరిగా ప్రజలతో మమేకమయ్యే జగన్ ను అభిమానులు చూసేలా కూటమి నాయకులు చేశారన్న భావన వ్యక్తం అవుతోంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
ఏపీలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపితో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసిపి గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసిపి ఐదేళ్లు గడిచేసరికి 11 స్థానాలకు పడిపోయింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత వైసిపి పని అయిపోయిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఒకరకంగా 2024 ఎన్నికల్లో వచ్చిన సీట్ల సంఖ్యను బట్టి చూస్తే వైసిపి ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని అంతా భావించారు. సాధారణంగా అయితే ఇదే జరుగుతుంది. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేస్తున్న విమర్శలు మరోసారి వైసీపీని పోటీలోకి తీసుకువస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మామూలుగా అయితే ఆరు నెలలపాటు ప్రతిపక్ష పార్టీలు బయటకు వచ్చేందుకు కూడా సాహసించవు. వైసీపీ లాంటి దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్న పార్టీలు అయితే కనీసం ఏడాది వరకు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాయి.
ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో అటువంటి పార్టీలు ఉండాలి. కానీ ఏపీలో కూటమి అనుసరిస్తున్న విధానాలు, వైసిపి నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న దాడులు కారణంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫలితాలు విడుదలై నెల రోజుల కాకముందే రోడ్డుమీదకు రావాల్సిన పరిస్థితిని కూటమి నాయకులు సృష్టించారు. ఇది ఒక రకంగా వైసీపీకి ఇమేజ్ ను మళ్ళీ క్రియేట్ చేసినట్లు అయింది. కూటమి బాధతో ఇంట్లో కూర్చోవాల్సిన జగన్ ను మళ్ళీ రోడ్డు ఎక్కి మునుపటి మాదిరిగా ప్రజలతో మమేకమయ్యే జగన్ ను అభిమానులు చూసేలా కూటమి నాయకులు చేశారన్న భావన వ్యక్తం అవుతోంది. అదే విధంగా విధానపరమైన నిర్ణయాలు కూడా కూటమికి శాపంగా మారాయి. అనేక ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తున్నాయి. వీటిలో ఇసుక పాలసీతోపాటు మద్యం విధానం కూడా ఉన్నాయి. అదే సమయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శిస్తూ ప్రతిరోజు పలువురు మంత్రులు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అంటే ఈ తరహా విమర్శల ద్వారా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజల్లోనే ఉండేలా కూటమి నాయకులు చేస్తున్నారు. ఇది కూడా ఒకరకంగా చెప్పాలంటే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా మారుతూ ఉందని చెబుతున్నారు. గతంలో కూడా ఈ తరహా విమర్శలను వైసిపి మంత్రులు చేయడం వల్లే చంద్రబాబు నాయుడుకు గడిచిన ఎన్నికల్లో కలిసి వచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అదే పనిని ఓటమి నాయకులు చేయడం కూడా వైసిపికి కలిసి వచ్చేలా చేస్తోందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకవైపు కూటమి నాయకుల విమర్శలు, ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూనే.. మరోవైపు కుటుంబపరమైన ఇబ్బందులను బలంగా ఢీకొంటున్నారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని ఆమె సోదరి వైయస్ షర్మిల చేస్తున్న విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డికి బలాన్ని చేకూరుస్తున్నాయి. వైయస్ షర్మిల కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండడంతో ఏపీలో జగన్ ఒక్కడే ఒకవైపు మిగిలిన వాళ్లంతా ఒకవైపు అన్న భావనను ప్రజలతోపాటు ఆయన అభిమానుల్లోనూ కలిగించినట్లు అయింది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాల్లో రెండు వర్గాలు ఉంటాయి. ఒక పార్టీకి చెందిన నాయకుడిని ఒక వర్గం అభిమానిస్తే, మరో వర్గం దానికి ప్రతిపక్షంగా ఉండే మరో పార్టీ నాయకుడిని అభిమానిస్తారు. ప్రస్తుతం కూటమి పార్టీలో ఉన్న నాయకులను అభిమానించే వారంతా ఒకవైపు ఉండగా, వారిని వ్యతిరేకించే వర్గం అంతా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైపు చూసే పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు కాంగ్రెస్ వైపు వెళ్లాలన్న భావనలో ఉన్న ఎంతో మంది ప్రస్తుతం షర్మిల వ్యవహార శైలితో వారంతా ఒకటే అన్న ఆలోచనలు పడినట్లు తెలుస్తోంది.
దీంతో జగన్మోహన్ రెడ్డితోనే ఉండాలని అనేక వర్గాలు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇది ఒక రకంగా వైసిపి బలంగా మారడానికి కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఐదు నెలలు కూడా కాకముందే అనేక నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రానున్న నాలుగున్నరేళ్లలో పార్టీని బలంగా నిలబెట్టుకోగలిగితే వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈలోగా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళతారా.? లేకపోతే పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటికి వస్తారా.? అన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చేయడంతోపాటు ఆయనకు ప్రజల్లో సింపతి కలిగేలా చేయడంలో కూటమి నాయకులతో పాటు ఆయన సోదరి షర్మిల చేస్తున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.