ఆంధ్రప్రదేశ్‌లో 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా రైతులను సమాయత్తం చేస్తున్నట్టు వెల్లడించారు. పోర్చుగల్‌కు చెందిన ప్రఖ్యాత గుల్బెంకియన్ అవార్డ్ ఫర్ హ్యుమానిటీస్‌ను దక్కించుకున ఏపీ సీఎన్‌ఎఫ్ ప్రతినిధులు, రైతులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిందని మంత్రి వెల్లడించారు. దాని ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని వివరించారు. ప్రకృతి వ్యసాయం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతోపాటు ప్రకృతిని పరిరక్షించేందుకు అవకాశం ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆదాయం కూడా రైతులకు మెండుగా లభిస్తుందన్నారు.
ప్రస్తుతం ఏపీలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పది లక్షల మంది రైతులు ప్రతనిధిగా నాగేంద్రమ్మ అవార్డును అందుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ అవార్డు కింద ప్రకటించిన నిధిని అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు వినియోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పర్యావరణంతోపాటు పౌష్టికాహారం అందేలా రైతు సాధికార సంస్థ సారథ్యంలోని ఏపీసీఎన్‌ఎఫ్ కృషి చేస్తోందని మంత్రి వివరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు వ్యవసాయశాఖతో కలిసి ఈ దిశగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వపరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసే పంటలకు డిమాండ్ ఏర్పడుతోందన్నారు.