Junior NTR | మొన్న తారకరత్న.. నిన్న లక్ష్మీపార్వతి.. జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి పునరుజ్జీవం?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| జూనియర్ ఎన్టీఆర్ Pic Credit: Twitter ||

ఈవార్తలు, పాలిటిక్స్: జూనియర్ ఎన్టీఆర్.. నటనలో నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో. బాబాయ్ బాలకృష్ణకు సరిసమానంగా తగ్గని మాస్ ఫాలోయింగ్ ఈ యంగ్ టైగర్ సొంతం. వ్యక్తిత్వం పరంగా తొలినాళ్లలో దూకుడుగా వ్యవహరించినా, తర్వాత నెమ్మదిగా హుందాతనాన్ని చూపిస్తున్నారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చేసరికి తారక్‌కు అన్యాయమే జరిగిందని చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి టీడీపీ పగ్గాలు తీసుకున్న చంద్రబాబు.. తన తర్వాత వారసుడిగా నారా లోకేశ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలవైపే దృష్టి సారించాడు. 2009 ఎన్నికలప్పుడు టీడీపీకి భారీగా ప్రచారం నిర్వహించిన తారక్.. ప్రచార సమయంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తర్వాత సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడంతో పరిస్థితులు మారాయి.

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తన కొడుకు నారా లోకేశ్‌కు పెద్ద పీట వేశాడు. కానీ, నాయకత్వ లక్షణాలు అంతగా లేని లోకేశ్ జగన్ ప్రభంజనం ముందు తేలిపోయాడు. చంద్రబాబు కూడా కులం కులం అంటూ తిరగడంతో మొదటికే మోసం వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడమే కాదు.. ఏకంగా పార్టీ కనుమరుగయ్యే దుస్థితికి చేరింది. దీనికంతటికీ కారణం.. చంద్రబాబు, లోకేశేనన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ను దీటుగా ఎదుర్కోవాలంటే చంద్రబాబుకు శక్తికి మించిన పని అవుతోంది. పార్టీ ప్రాభవం కోల్పోవడం, నాయకుడిగా లోకేశ్‌కు సత్తా లేకపోవడం, చంద్రబాబుపై ప్రజలు నమ్మకం కోల్పోవడం లాంటి కారణాలు జగన్‌కు మంచే చేస్తున్నాయి. అయితే, టీడీపీకి పునరుజ్జీవం ఎవరు తెస్తారు? అంటే జూనియర్ ఎన్టీఆరేనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎవరినడిగినా చెప్తారు. తాత పెట్టిన పార్టీని కాపాడే బాధ్యత ఎన్టీఆర్‌కు ఉంది. అయితే.. తారక్ టీడీపీకి ప్రచారం చేస్తారా? అని అతడి అన్న తారకరత్నను విలేకరులు అడగ్గా.. సరైన సమయం వస్తుందని చెప్పాడు. నిన్న లక్ష్మీపార్వతి కూడా దాదాపు అదే సమాధానం ఇచ్చింది.

తనకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రారని, లోకేశ్ నాయకత్వాన్ని ఎన్టీఆర్ సమర్థించడం లేదని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. తనకు బాధ్యతలు అప్పగిస్తే అప్పుడు కచ్చితంగా టీడీపీలోకి వస్తారని వెల్లడించారు. పరోక్షంగా టీడీపీకి నాయకుడిగా ఎన్టీఆరే సమర్థుడు అని ఆమె చెప్పకనే చెప్పారు. డైరెక్టుగానే చెప్పేవారు.. కానీ ఆమె ఇప్పుడున్నది వైసీపీలో కదా!


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్