|| ప్రతీకాత్మక చిత్రం ||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 2023లో ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ జాబితాను విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం తెలంగాణలో మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 1,49,24,718 మంది, పురుషులు 1,50,48,250 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 2,78,650 మంది 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారే. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 42,15,456 ఓట్లు ఉన్నాయి. రెండో స్థానంలో రంగారెడ్డి ఉంది. అక్కడ 31,08,068 మంది ఓటర్లు ఉన్నారు. ఇక, మూడో స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి ఉండగా, అక్కడ 25,24,951 ఓట్లు ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,08,176 మంది ఓటర్లే ఉన్నారు.
నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది, అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 1,42,813 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. జాబితా విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. తుది జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామని చెప్పారు. ఓటు నమోదు అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, ఓటు హక్కు నమోదు చేయించుకోవాలనుకునేవారు వెబ్ సైట్ లేదా యాప్ లేదా స్థానిక ఎన్నికల అధికారిని సంప్రదించాలని సూచించారు.
ఓటరు తుది జాబితా వివరాలు:
తెలంగాణలో మొత్తం పోలింగ్ కేందాలు 34,891
తెలంగాణలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 19,314
మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941
పురుష ఓటర్లు 1,50,48,250
మహిళా ఓటర్లు 1,49,24,718
ట్రాన్స్ జెండర్లు 1,951
ఎన్నారైలు 2,740
సర్వీస్ ఓట్లు 15,282