Chandrababu | తెలంగాణ టీడీపీ శ్రేణులపై చంద్రబాబు ప్రశంసలు.. ఎందుకో తెలుసా..

ఆంధ్రప్రదేశ్ లో విజయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరోక్షంగా ఎంతగానో కృషి చేశారని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

CM Nara Chandrababu Naidu

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ లో విజయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరోక్షంగా ఎంతగానో కృషి చేశారని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన ఆదివారం ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేసేందుకు ఇక్కడకు వచ్చానన్నారు. ఇక్కడి ప్రజలు అభిమానం చూస్తుంటే తనకు ఉత్సాహం కలుగుతోందన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయానికి పరోక్షంగా కృషి చేసిన తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్టీఆర్ అనేక పరిపాలన సంస్కరణలను తీసుకువచ్చారని, సంక్షేమానికి నాంది పలికిన నాయకుడిగా అభివర్ణించారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినప్పటికీ కార్యకర్తలు పార్టీని విడిచిపెట్టి వెళ్లలేదన్నారు. పార్టీ నుంచి నాయకులే వెళ్లారు తప్ప కార్యకర్తలు వెళ్లిపోలేదన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చామన్నారు.

తనను జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన చొరవ మరువలేనిదన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో తన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారన్నారు. తనను అరెస్టు చేసిన సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను తాను మరిచిపోలేనని స్పష్టం చేశారు. హైదరాబాదులో తనకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలను టీవీలో చూసి గర్వపడ్డానన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి తెలుగుదేశం పార్టీ హయాంలోనే నాంది పలికామని, తర్వాత కాంగ్రెస్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి అభివృద్ధిని కొనసాగించాయన్నారు. విభజన సంస్థలు పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నట్లు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.  తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం అవసరం ఉందన్నారు. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ అభివృద్ధి తన ధ్యేయమని, ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలు ఎక్కువని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, సిద్ధాంత పరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ, తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2019 తర్వాత ఏపీలో విధ్వంస ప్రభుత్వం వచ్చిందని, విభజన కంటే వైసీపీ పాలనతోనే ఎక్కువ నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాట పట్టించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలోని పార్టీని కార్యకర్తలను ఆదుకుంటామన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్