Telangana | ఏందయ్యా రేవంత్ రెడ్డి.. దొరల పాలన అన్నారు.. రెడ్డి రాజ్యం చేస్తున్నారు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Photo: Facebook||

(ఈవార్తలు సంపాదకీయం)

తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. రాజకీయ ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కి తారాస్థాయికి చేరింది. చివరికి ఒక పార్టీ అధికారం కోల్పోగా, ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీపై చేయాల్సిన అన్ని ఆరోపణలు చేసింది. అందులో ముఖ్యమైంది.. దొరల పాలన. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, వెలమలే ఏలుతున్నారని ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే గడీల పాలన తొలగించి, ప్రజల పాలన తీసుకొస్తామని హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి కూడా వీలైనప్పుడల్లా కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. దొరల పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్‌కు అవకాశం ఇద్దామని ఆలోచించి ఓట్లు వేశారు. రాష్ట్రంలో అధికారాన్ని అప్పగించారు.

ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా, కాంగ్రెస్ సర్కారు అదే.. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక కీలక పోస్టుల్లో అందర్నీ రెడ్డి సామాజిక వర్గం వారినే నియమించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొరల పాలన అంటూ వెలమ వర్గంపై కత్తి దూసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తన సామాజిక వర్గానికి కీలక పదవులు కట్టబెట్టడంపై తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని, ప్రజా పాలన తెస్తామని చెప్పిన మాటలన్నీ నీటి మీది రాతలేనా? అని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని నియమించారు. ఈ మధ్యే సీఎం సీపీఆర్వోగా అయోధ్య రెడ్డిని, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. పలు కీలక పోస్టుల్లోనూ రెడ్డి సామాజిక వర్గం వారినే నియమించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పైగా, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం 26 మంది రెడ్డి సామాజిక వర్గం వారే కావడం గమనార్హం. అంతేకాదు.. తన మంత్రి వర్గంలో తనతో పాటు నలుగురు రెడ్డి సామాజిక వర్గం మంత్రులే ఉన్నారని జోరుగా చర్చ జరుగుతోంది. ఆ మధ్య ఓ సమావేశంలో పాల్గొన్న రేవంత్.. రెడ్డిలకే అధికారం ఇవ్వాలని, రెడ్లతోనే పార్టీలు బాగుపడతాయన్నట్లు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దొరల పాలనకు అంతం చెప్పి, ప్రజా పాలన తెస్తామన్న రేవంత్ రెడ్డి.. రెడ్డి రాజ్యం తెస్తున్నారేంటని ప్రశ్నిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో చైతన్యం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తోందని, చైతన్యం వచ్చే వరకు పరిస్థితి మారదని నిట్టూరుస్తున్నారు. ప్రజా పాలన దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేయాలని, అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్