||కల్వకుంట్ల కవిత Photo: twitter||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: స్కాం జరిగింది ఢిల్లీలో.. అందులో పాత్ర ఉన్నవారు దేశమంతటా ఉన్నారు.. వారందరినీ ఈడీ అరెస్టు చేస్తూ వస్తోంది.. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని ఆదేశించింది. అయితే, విచారణకు రమ్మంటే.. కల్వకుంట్ల కవిత మాత్రం లిక్కర్ స్కాంకు, యావత్తు తెలంగాణకు లింక్ పెట్టేశారు. తప్పు చేశారో, లేదో తెలియదు కానీ.. తన మీదికి వచ్చేసరికి మాత్రం తెలంగాణ గళం ఎత్తుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. ‘తెలంగాణ ఎప్పటికీ తలవంచదు. నాకు నోటీసులు వచ్చాయి. 9వ తేదీన హాజరు కావాలన్నారు. లిక్కర్ స్కాంలో నేను చేసిందేమీ లేదు. చట్టాలను గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా. ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో ఈడీ విచారణకు హాజరయ్యే అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటా. ఈ కేంద్రం కుట్రలు బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఏమీ చేయలేవు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. ప్రజల హక్కుల కోసం పోరాడుతాం’ అని పేర్కొన్నారు.
అయితే, లిక్కర్ స్కాంలో పాత్రపై విచారణ చేపట్టేందుకు మాత్రమే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ.. మొత్తం తెలంగాణనే విచారణకు పిలిచినట్లు కవిత అంటున్నారని, ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు స్కాం మరకలు అంటగట్టేలా ఉన్నాయని పలువురు కవితపై మండిపడుతున్నారు. ఇక, ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే నోటీసులు ఇవ్వాలా? ప్రపంచంలోని మహిళలందరినీ అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. ఇది మరింత హాస్యాస్పదంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, రాజకీయ నాయకులు సొంత లాభం కోసం ప్రాంతానికి, రాష్ట్రానికి, భాషకు, దేశానికి, కులానికి, మతానికి లింక్ పెట్టడం కామన్ అయిపోయిందని పేర్కొంటున్నారు.