బీఆర్ఎస్ కోసం రంగంలోకి బీజేపీ.. అసలు విషయం తెలిస్తే హవ్వా అనాల్సిందే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||బీఆర్ఎస్ కోసం రంగంలోకి బీజేపీ.. అసలు విషయం తెలిస్తే హవ్వా అనాల్సిందే..||

తెలంగాణ ఏర్పాటయ్యాక ఇవి మూడో అసెంబ్లీ ఎన్నికలు. తొలి రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ముందు అన్ని పార్టీలు కొట్టుకుపోయాయి. కానీ, మూడోసారి ఎన్నికల్లో బీఆర్ఎస్‌ సర్కారుకు గడ్డుకాలం ఎదురైంది. హామీలు వర్కౌట్ కావటం లేదు. రుణమాఫీ, రైతుబంధు, దళితబంధు, బీసీబంధు వంటి పథకాలు ఆ పార్టీకి రివర్స్ అయ్యాయి. 9 ఏళ్లు అధికారంలో ఉండి రుణమాఫీ చేయకుండా, ఎన్నికల ముందు తూతూ మంత్రంగా చేసి, అయ్యో మొర్రో అని మొత్తుకుంటే ఏం వస్తుందని రైతులే బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. తాజా సర్వే ప్రకారం బీఆర్ఎస్‌కు 35 సీట్లకు మించి రావన్న సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించి అధికారం చేపట్టబోతోందన్నది ఆ సర్వే సారాంశం. మరోవైపు బీజేపీ పోటీలోనే లేకుండా పోయింది. బండి సంజయ్ కుమార్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు అప్రతిహత విజయాలతో దూసుకుపోయిన కాషాయ పార్టీ.. ఆయనను తొలగించగానే ఒక్కసారిగా కుంటుపడింది.

ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 4 సీట్లకు మించి గెలిచే చాన్స్ లేదని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేయాలంటే ఎలా? అని ఆ పార్టీ మదన పడుతున్నట్లు సమాచారం. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీనే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆ పార్టీ పెద్దలు లూజ్ టంగ్‌తో బీఆర్ఎస్‌కు ఫేవర్ చేయాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

నిన్నకి నిన్న.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి.. అవును! తాము బాయికాడ మీటర్లు పెట్టనందుకే 25 వేల కోట్లు ఆపామని వ్యాఖ్యానించారు. తాజాగా, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప వచ్చి.. కాంగ్రెస్ హామీలను నమ్మవద్దని ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు చర్యలు కూడా బీఆర్ఎస్‌కు కలిసివచ్చేవే. ఈ వ్యాఖ్యలే కాదు.. రాబోయే వారం రోజుల్లో అనేక మంది బీజేపీ పెద్దలు తెలంగాణకు రానున్నారు. వీరంతా తమ లూజ్ టంగ్‌తో బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంకు పెంచి, కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టే వ్యూహం రచిస్తున్నట్లు రాజకీయ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు కొద్దిగా నష్టమే. అయితే, ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారని, బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుయుక్తులు ప్రయోగించినా కాంగ్రెస్‌కు ఓట్లు పడడం పక్కా అని స్పష్టం చేస్తున్నారు.

ఎన్నికల ముందు వచ్చే వేవ్ ఓటుగా మారడం కామన్. గత అన్ని ఎన్నికల్లో ఇదే స్పష్టమైంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ హవాలో బీఆర్ఎస్ కారు కొట్టుకుపోతుందని, బీజేపీ కమలం వాడిపోతుందని తేల్చిచెప్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు పెరిగిందని, పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా ఉంటే, రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ 80 సీట్లు గెలుచుకోవడం సాధ్యమేనని పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్