డ్రగ్స్ వ్యసనం నుంచి యువతను దారిలో పెట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జబర్దస్త్ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తేవాలని నిర్ణయించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ యువత ఏం చేస్తోంది అంటే.. మత్తులో ఊగుతోంది అని చెప్పాల్సిన దుస్థితి. ఏ పల్లెకు పోయినా, ఏ పట్టణంలో చూసినా, ఏ గల్లీలో తిరిగినా గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఓ జిల్లా కేంద్రంలో ఏకంగా పోలీస్ స్టేషన్‌ను ఆనుకొని ఉన్న షాపులోనే గంజాయి చాక్లెట్లు దొరకడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యసనం నుంచి యువతను దారిలో పెట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జబర్దస్త్ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తేవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహకారం, ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే క్రీడల ప్రోత్సాహానికి బడ్జెట్లో రూ.321 కోట్లు కేటాయించినట్లు సీఎం గుర్తుచేశారు. చదువులోనే కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతుందనే నమ్మకం యువతలో కలిగిస్తామని తెలిపారు. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు గ్రూప్1 ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం వివరణ ఇచ్చారు.
నెట్ జీరో సిటీలో స్కిల్ యూనివర్సిటీ, హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్‌తోపాటు స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్పోర్ట్స్ యాక్టివిటీలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రేవంత్ తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా క్రీడలు ఉపకరిస్తాయని వెల్లడించారు. శాసనసభ్యులు కూడా తమ క్రీడాస్ఫూర్తిని కూడా చాటుకునేలా ఇకపై ప్రతి బడ్జెట్ సెషన్ లో కార్యక్రమాలు నిర్వహించే సంప్రదాయాన్ని పునరుద్ధరించే అంశంపై అఖిలపక్షంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.