Flash News | తెలంగాణలో పంచాయితీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మంత్రి సీతక్క సహా అధికారులు పాల్గొన్న ఎన్నికల సమావేశంలో.. రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేయకుండా గత రిజర్వేషన్లనే కొనసాగించాలని నిర్ణయించారు.

telangana cm revanth reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మంత్రి సీతక్క సహా అధికారులు పాల్గొన్న ఎన్నికల సమావేశంలో..  రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేయకుండా గత రిజర్వేషన్లనే కొనసాగించాలని నిర్ణయించారు. ఆగస్టులో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలల కావస్తున్నందున రిజర్వేషన్లలో మార్పులు చేయకుండా గత రిజర్వేషన్లే కొనసాగించి, ఎన్నికలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని  అధికారులకు సీఎం సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్‌ను ఆదేశించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.

సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.

రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే పంచాయతీల్లో అభివృద్ధి కుంటు పడుతుందన్న ఉద్దేశంతోనే సీఎం రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, రైతు రుణమాఫీ అంశం కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని, ఆలస్యం చేస్తే ఓటు మారే అవకాశం ఉన్నందున రాజకీయంగానూ ఇబ్బందులు తలెత్తకుండా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 

గతంలో 2019లో జరిగిన ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ సహా కొత్త సభ్యులు నియమితులయ్యారు. అయితే, ఐదేళ్ల పదవీకాలం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1తో గడువు ముగిసింది. దీంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారులతో పాలనను కొనసాగిస్తున్నారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, వ్యవసాయశాఖ అధికారి, ఎండీవో, ఎంపీవో, సమాన స్థాయి గెజిటెడ్ అధికారితో పాలన కొనసాగుతోంది. గ్రామ కార్యదర్శితో పాటు వీరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు వీరి ఆధ్వర్యంలోనే గ్రామాల్లో పనులు జరుగుతాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్