మూసీ పునరుజ్జీవంపై ప్రజెంటేషన్ ఇస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి వెదవ అని సీఎం రేవంత్ రెడ్డి సంభోదించారు. మరోవైపు తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో సమావేశమైన కేటీఆర్.. ‘రేవంత్ ఓ హౌలే సీఎం’ అని తీవ్ర పదజాలం వాడారు.
కేటీఆర్, రేవంత్ రెడ్డి
కాగా, మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రాన్ని, నగరాన్ని బాగు చేసేందుకు మూసీ ప్రాజెక్టు చేపట్టామని రేవంత్ అన్నారు. తనకు ఆస్తి, అంతస్థులు, పదవి అన్నీ ఉన్నాయని.. ఎవ్వరినో మోసం చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రాజెక్టు కోసం వెచ్చించే రూ.1.50 లక్షల కోట్లలో ఒక్క రూపాయి కూడా తాము ఆశించడం లేదని వివరించారు. ‘మేం చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు. మూసీ నది పునరుజ్జీవం. కొందరు వాళ్ల మెదడులో.. మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకొన్నారు. మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్న నేతలు 3 నెలలు మూసీ ఒడ్డున ఉండాలి. కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ 3 నెలలు మూసీ ఒడ్డున ఉంటే.. వాళ్లకు కావాల్సిన వసతులు కల్పిస్తాం. ఆ ముగ్గురూ మూడు నెలలు అక్కడ ఉంటే.. ఈ ప్రాజెక్టును ఆపేస్తాం’ అని సవాల్ విసిరారు. మరోవైపు, రేవంత్ రెడ్డి మీడియా సమావేశంపై కేటీఆర్ స్పందించారు. మూసీపై శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తెలంగాణభవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని తెలిపారు. మూసీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులు, మూసీ పునరుజ్జీవనం కోసం చేసిన ప్రయత్నాలు, ప్రణాళికలు వివరిస్తానని పేర్కొన్నారు.