||సీఎం కేసీఆర్ Photo: Instagram||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణలో అధికార పార్టీ టికెట్లు ఎవరిని వరించనున్నాయి? అన్న ఉత్కంఠకు తెరపడనుంది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న అభ్యర్థుల పేర్లు.. మంచి శుభ సమయాన విడుదల చేయనున్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం కూడా ఖరారు చేశారు. శ్రావణ సోమవారం సందర్భంగా రేపు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు. తొలి జాబితాలో 96 మంది సీట్లు కన్ఫార్మ్ చేసినట్లు సమాచారం. మిగతా 13 సీట్లను తర్వాత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 96 సీట్లలోనూ సిట్టింగులకే అవకాశం కల్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగతా సీట్లలో కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టికెట్లు కన్ఫార్మ్ చేసిన అభ్యర్థులకు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాలని, కావాల్సిన పనులు చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
అటు.. టికెట్ల కోసం ఆశావహులు తెలంగాణ భవన్‌కు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద వాతావరణం సందడి సందడిగా ఉంది. టికెట్లు దక్కని వారిని బుజ్జగించే పనిని మంత్రి కేటీఆర్ ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. నిన్న కల్వకుర్తి సభలో మాట్లాడిన ఆయన.. నియోజకవర్గంలో బీ-ఫాం ఒక్కరికే వస్తుందని, మిగతావారంతా ఆ అభ్యర్థిని కష్టపడి గెలిపించాలని సూచించారు. అల్టిమేట్‌గా హ్యాట్రిగ్‌గా సీఎం పీఠంలో కేసీఆర్‌ను కూర్చోబెట్టాలని పిలుపునిచ్చారు.
అదే సమయంలో అసంతృప్తులు ఉన్నవారిని మంత్రి కేటీఆర్ పిలిపించుకొని స్వయంగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. టికెట్లు రావని భయపడవద్దని, భవిష్యత్తులో మంచి పదవి ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో అనధికారికంగా ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. వీలైనంత మందికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్, బీజేపీ కూడా తమ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసుకుంటున్నాయి. బీజేపీ ఇప్పటికే 45-50 మంది పేర్లను రెడీ చేసి పెట్టుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ కూడా లిస్ట్ రెడీ చేసి పెట్టుకుందని, బీఆర్ఎస్ లిస్ట్ విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ కూడా రిలీజ్ చేస్తుందని పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు.